జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో.. గులాబీబాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా రంగంలోకి దిగి.. తన ముద్ర గల మంత్రాంగం ప్రారంభించారు. మజ్లిస్ తో ఆయన స్వయంగా మంతనాలు ప్రారంభించారు. బల్దియా ఎన్నికల్లో కలిసి పోటీచేసే అవకాశాల గురించి ఇరువురు నేతలు సమావేశం అయ్యారు. ఈమేరకు మజ్లిస్ అధినేత అక్బరుద్దీన్ ఒవైసీ గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఇరువురు నేతల మధ్య ఇది కీలక సమావేశం.
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ– తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు మధ్య ఎన్నికలకు సంబంధించి ఫైనల్ కుదురుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి బల్దియా ఎన్నికల్లో సీట్ల పంపకం విషయంలో ఈ సారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎలాంటి చాన్స్ తీసుకోకూడదని గులాబీ బాస్ భావిస్తున్నారు.
భాగ్యనగరంలో బలమైన ఓటు బ్యాంకు కలిగివున్న మజ్లిస్ పార్టీ గత ఎన్నికలలో కంటే అధిక సీట్లు పొత్తు పంపకాల్లో డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎవరికీ ఎన్ని సీట్లు వచ్చినా సరే నగర మేయర్ పదవి తమకు ఇవ్వాలని ఈ ఒప్పందానికి ఒప్పుకుంటేనే రాష్ట్రవ్యాప్తంగా ముందు ముందు రాబోయే ఎన్నికల్లో కూడా తెరాసతో తమ పొత్తుకొనసాగుతుందని అసదుద్దీన్ పట్టుబట్టే అవకాశం ఉంది.
దుబ్బాక ఓటమితో సీన్ మారింది
దుబ్బాకలో మరింత ఘనవిజయం దక్కి ఉంటే గనుక.. కేసీఆర్ మజ్లిస్ తో పొత్తు గురించి పెద్దగా పట్టించుకుని ఉండేవారు కాదేమో. ఎప్పటిలా పొత్తు అనే ట్యాగ్ లైన్ లేకుండా.. స్నేహపూర్వక అవగాహనతో ముందుకు వెళ్లి ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దుబ్బాకలో దారుణ పరాజయంతో పాటు, బీజేపీ కూడా బలపడుతున్న నేపథ్యంలో మజ్లిస్‌తో అధికారిక పొత్తుకు కేసీఆర్ సిద్ధపడుతున్నారని సమాచారం.
దుబ్బాక ఫలితం ప్రభావం నగర ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటుంది. అందుకే కేసీఆర్ ఏ చిన్న పొరబాటూ జరగకూడదనే ఉద్దేశంతో స్వయంగా రంగంలోకి దిగారు. అసదుద్దీన్ తో భేటీ అయ్యారు. ఇరువురు నేతల మధ్య తొలిభేటీలోనే ఫైనల్ డీల్ కుదిరే అవకాశం లేదు. మరో రెండు భేటీలు అయినా తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేసీఆర్ మెట్టు దిగాల్సిందే..
మజ్లిస్ తో పొత్తు కుదరాలంటే.. కేసీఆర్ మెట్టు దిగక తప్పదనే భావన పలువురిలో వ్యక్తమవుతోంది. దుబ్బాకలో సిటింగ్ స్థానం నిలబెట్టుకోలేక.. టీఆర్ఎస్ దీనంగా ఉంది. అదే మజ్లిస్ విషయానికి వస్తే.. అటు బీహార్ లో కూడా సీట్లు గెలుచుకుని మంచి జోరు మీద ఉంది. ఈ నేపథ్యంలో మజ్లిస్ ఏ డిమాండు వినిపిస్తే దానికి కేసీఆర్ తలొగ్గక తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ దిశానిర్దేశం
గ్రేటర్ హైదరాబాద్ లో వందకు పైగా కార్పొరేటర్ స్థానాలు దక్కించుకోవాలి అని కేసీఆర్ అన్నారు. దుబ్బాక ఫలితం ఎఫెక్ట్ గ్రేటర్ లో ఉండదని, రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని పార్టీ నాయకులతో చెప్పారు. నేతలు అప్రమత్తంగా వ్యవహరించాలి అని ఆయన అన్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల లోను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కరోనా కారణంగా చాలా రోజుల తరువాత కలుసుకున్నమని, బీజేపీ తప్పుడు ప్రచారం పై నేతలు ధీటుగా స్పందించాలని కేసీఆర్ మార్గదర్శనం చేశారు. మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో కెసిఆర్ సమావేశం అయ్యారు. సమావేశం జరుగుతున్నప్పుడే ప్రగతి భవన్ కు ఎంపీ అసదుద్దీన్ చేరుకున్నారు. గ్రేటర్ లో ఎం ఐ ఎం తో కలిసి పనిచేస్తామన్న సీఎం పార్టీ నేతలకు చెప్పారు.











