మెగాస్టార్ కుమార్తె నిర్మాతగా రూపొందుతున్న వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది. వాస్తవ గాధతో ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి కుమార్తె సుస్మిత, ఆమె భర్త విష్ణు ప్రసాద్ కలిసి గోల్డ్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఎనిమిది ఎపిసోడ్ లుగా క్రైమ్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తీవ్రవాదం ఈ వెబ్ సిరీస్ ప్రధాన నేపథ్యం. ఏప్రిల్ 7, 2015 ఆలేరులో జరిగిన టెర్రరిస్ట్ వికారుద్దీన్ ఎన్ కౌంటర్ ఆధారణంగా ఈ సిరీస్ రూపొందుతోంది. దీంతో ఈ వెబ్ సిరీస్ ను నిలుపుదల చేయాలని డిమాండు ఊపందుకుంది. ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ దీనికి అడ్డుగా నిలుస్తున్నారు. ఇందులో వికారుద్దీన్ మాత్రమే కాకుండా చాలామందిని దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నది ఆయన ఆరోపణ.
అంతేకాదు నిందితుల కుటుంబ సభ్యుల నుంచి అనుమతి కూడా తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ప్రోమోలు కూడా విడుదలయ్యాయి. వీటిని ఆపాలని కూడా డిమాండు చేస్తున్నారు. మొత్తానికి మెగా డాటర్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు ఆటంకాలు తప్పడం లేదు. షూటింగ్ పూర్తయి ఇక విడుదలే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఈ అవాంతరాలు ఏమిటో ఆ యూనిట్ కే అర్థం కావడంలేదు. దర్శకుడు ఆనంద్ రంగా ఇంతకుముందు ‘ఓయ్’ పేరుతో సినిమా రూపొందించారు. వెబ్ సిరీస్ ద్వారా తన ప్రతిభను నిరూపించుకోవాలన్న తపనతో ఉన్నారు. జీ 5లో డిసెంబరు 25 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.











