ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరికి అవకాశం దక్కనుంది? సీఎస్ రేసులో ఎవరెవరు ఉన్నారు? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం సీఎస్‌గా పని చేస్తున్న నీలం సాహ్ని పదవీ కాలం ముగిసింది. ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆమె పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు పొడగించింది. మరో నెల రోజుల్లో ఆమె పదవీ విరమణ చేయనున్నారు. ఆమె తరవాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియారిటీ రేసులో అనేక మంది ఉన్నారు. ప్రధానంగా ఆదిత్యనాథ్ దాస్, నీరబ్ కుమార్ ప్రసాద్, అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. అయితే, చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా కీలక పదవుల్లో పని చేసిన సతీష్ చంద్రను సీఎస్‌గా తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. నీరబ్ కుమార్ సర్వీసు 2024 వరకు ఉంది. ఇప్పడు సీఎస్‌గా అతనికి అవకాశం కల్పిస్తే 2024 వరకు పదవిలో ఉంచాల్సి వస్తుంది. ఈ కారణంతో అతన్ని పక్కన పెడతారని తెలుస్తోంది.

ప్రధానంగా ఆదిత్యనాధ్ దాస్ పేరు
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేసిన ఆదిత్యనాథ్ దాస్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆదిత్యనాథ్ దాస్‌కు సీఎంవోలో కొన్ని కీలక బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం అందుతోంది. మరో నెల రోజుల్లో సీఎంవోపై పట్టుసాధిస్తే ఆదిత్యనాథ్ దాస్‌ను సీఎస్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ముందుగానే సీఎంవోలో కీలక బాధ్యతలు ఆదిత్యనాథ్ దాస్‌కు అప్పగించారని తెలుస్తోంది. పలు శాఖల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు, ఆదిత్యనాథ్ దాస్‌కు వివాద రహితుడిగా పేరుంది.
ప్రభుత్వాన్ని గట్టెక్కించే అధికారి కోసం గాలింపు
ఏపీ ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో కూరుకుపోయి ఉంది. నవరత్నాలు కొనసాగించాలంటే ఏటా లక్ష కోట్లు అప్పు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. మరో వైపు ఏపీ ఆదాయం దారుణంగా పడి పోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో లక్షా 20వేల కోట్ల పన్నుల ఆదాయం అంచనా వేయగా, అది కేవలం రూ.50 వేల కోట్లు మాత్రమే వచ్చింది. మరో రూ.10 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదాయం పెంచడంతో పాటు, చక్కగా అప్పులు తేగలగిన సీనియర్ అధికారి కోసం సీఎం జగన్మోహన్‌రెడ్డి గాలిస్తున్నారని తెలుస్తోంది. ఆదిత్యనాథ్ దాస్‌కు ఆర్థిక శాఖపై కూడా పట్టు ఉండటంతో అతనికి కలసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తంమీద ఆతిత్యనాథ్ దాస్ పేరు ఏపీ సీఎస్‌గా దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది
Must Read ;- ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!











