ఐఏఎస్… అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. దేశంలోనే అత్యున్నత సర్వీసు. ఈ సర్వీసు అధికారులకు ఆ శాఖ, ఈ శాఖ అన్న తేడా ఏమీ ఉండదు. అన్ని శాఖలపైనా మంచి పట్టు ఉంటుంది. అంతేనా… మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే వారి అనుపానుల్లో నడుస్తూ ఉంటుంది. ఏ ప్రభుత్వం అమలు చేసే పథకాలనైనా.. రూపొందించేది వారే, అమలు చేసేది వారే. వాటిలోని లోటుపాట్లను సరిదిద్దేది కూడా వారే. ఇంతటి ఉన్నతమైన సర్వీసుకు చెందిన ఓ కీలక అధికారికి ఏపీ ప్రభుత్వం అరుదైన శ్రీముఖాన్ని పంపింది. ఐఏఎస్‌గా ఇప్పటికే తర్ఫీదు పొంది ఉన్నా.. మరోమారు ఏదైనా యునివర్సిటీకి వెళ్లి చదువుకుని రావాలంటూ సదరు అధికారికి ఏపీ ప్రభుత్వం నోటీసు అందించింది. ఏపీలోనే కాకుండా యావత్తు దేశంలోనే ఇప్పటి దాకా కనీవినీ ఎరుగని రీతిలో ఈ శ్రీముఖానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఏకంగా జీవోను జారీ చేశారు. ఈ జీవో ఇప్పుడు ఐఏఎస్ అధికారుల్లో పెద్ద చర్చకే తెర లేపింది. ఈ కథా కమామీషు ఏమిటన్న వివరాల్లోకి వెళ్లితే…
ఏపీ ఎన్నికల కమిషన్‌కు కార్యదర్శిగా పనిచేస్తున్న వాణీ మోహన్… 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. గ్రూప్-1 అధికారిణిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆమె ఆ తర్వాత ఐఏఎస్‌గా కన్ఫర్డ్ అయ్యారు. 25 ఏళ్లుగా ఆమె అధికారిణి హోదాలో పలు కీలక పోస్టుల్లో పని చేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఉన్న ఆమె అంతకు ముందు ల్యాండ్ సెటిల్‌మెంట్ కమిషనర్‌గా పని చేశారు. ఆ సమయంలో పలు ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసినట్లుగా ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయానికి సంబంధించి నడుస్తున్న కేసుల్లోనూ ఆమె తన వాదనలను వినిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ నగరానికి చెందిన ఓ భూ వివాదంలోనూ తానేమీ తప్పు చేయలేదని కూడా ఆమె వాదిస్తున్నారు.
Must Read ;- జగన్ సైలెన్స్.. ఏపీ రైతుల ఖర్మేనా?
సంచలన నిర్ణయం
ఈ క్రమంలో వాణి మోహన్ వాదనలపై తనదైన శైలి ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎస్ నీలం సాహ్ని… ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చట్టాలపై వాణి మోహన్‌కు అవగాహన లేదని తనకు తానే ఓ కన్‌క్లూజన్ కు వచ్చిన సాహ్ని… వాణి మోహన్ తీరును తప్పు బడుతూ తనదైన శైలిలో మందలించారు. ఐఏఎస్‌గా ఇప్పటి దాకా ఏం చదువుకున్నావో తెలియదు గానీ… చట్టాలపై నీకు ఎంతమాత్రం అవగాహన లేదు. ఇప్పటికైనా ఏదైనా యునివర్సిటీకి వెళ్లి చట్టాలను మరోమారు చదువుకుని రా… అంటూ తనదైన శైలిలో వాణి మోహన్‌కు ఓ శ్రీముఖాన్ని జారీ చేశారు. సాధారణంగా ఇలా అధికారులు తమ విధి నిర్వహణలో ఏదైనా తప్పు చేస్తే… పిలిపించి మందలించడమో, లేదంటే… ఓ చార్జీ మెమోనో జారీ చేయడం రివాజు. అయితే అందుకు విరుద్ధంగా వ్యవహరించిన నీలం సాహ్ని… వాణి మోహన్‌కు చీవాట్లు పెడుతూ ఇచ్చిన శ్రీముఖాన్ని ఏకంగా జీవో రూపంలో జారీ చేసి పారేశారు. ఈ తరహాలో మెమోలను జీవోల రూపంలో ఇప్పటి దాకా విడుదల కాని వైనాన్ని ప్రస్తావిస్తున్న ఐఏఎస్‌లు నీలం సాహ్ని తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ సంచలనమైన ఓ మెమో జారీ
జగన్ పాలనలో ఈ తరహా వింతలు ఇప్పటికే చాలా చూశామన్న మాట కూడా ఇప్పుడు బహాటంగానే వినిపిస్తోంది. సీఎస్ మొత్తం రాష్ట్ర పాలనకు బాస్‌గా ఉంటున్న వైనం తెలిసిందే. అయితే అలాంటి బాస్‌కు జగన్ వద్ద సీఎం కార్యదర్శిగా పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారి మెమో లాంటిది జారీ చేయడం గతంలో పెను కలకలమే రేపిన సంగతి తెలిసిందే. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పాలనలో ఎంతమాత్రం అవగాహన లేకుండా జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు కూడా ఎప్పటికప్పుడు వివాదాస్పదమవుతూనే వస్తోంది. అసలు ఏ స్థాయి అధికారికి ఏ తరహా బాధ్యతలు, అధికారాలు ఉంటాయన్న విషయం కూడా జగన్ అండ్ కోకు పూర్తిగా అర్థం కావడం లేదన్న గుసగుసలూ ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ ఐఏఎస్ అధికారిణికి చట్టాలు మళ్లీ చదువుకుని రావాలంటూ ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి బాస్‌గా ఉన్న సీఎస్ ఏకంగా జీవో జారీ చేయడం ఈ వింతల్లోకెల్లా వింతగా నిలుస్తోందన్న మాట వినిపిస్తోంది.
Also Read ;- స్థానిక ఎన్నికల మాటెత్తితేనే వైసీపీకి హడల్










