అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. గత రెండు నెలల నుంచి అప్పు పుట్టక వేస్ అండ్ మీన్స్ అంటే ఆర్బీఐ వద్ద ఏ రోజుకు ఆరోజు చేబదుళ్లు చేస్తోంది. ప్రభుత్వ ఆదాయం నెలకు రూ.12 వేల కోట్లు అంచనా వేయగా అది కేవలం రూ.5 వేల కోట్లలోపే వస్తోంది. దీనికి తోడు నవరత్నాల పథకాలకు ప్రతి నెలా రూ.7 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇవ్వడమే ప్రభుత్వానికి భారంగా మారింది. ఒకటో తేదీన ప్రభుత్వోద్యోగులకు జీతాలు, పెన్సన్లు ఇవ్వాల్సి ఉండగా ప్రతి నెలా 14 తేదీ వరకూ దశల వారీగా చేబదుళ్లు తీసుకుని బ్యాంకుల్లో జమ చేస్తూనే ఉన్నారు. అయితే మరో రూ.25 వేల కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా రూ.25 వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
అంత ఇవ్వలేం..
కేంద్రం ఎఫ్ఆర్బీఎం నిబంధనలు సడలించిన తరవాత ఏపీ ప్రభుత్వానికి మరో రూ.6 వేల కోట్లు అప్పు తీసుకునే వెలుసుబాటు దక్కింది. అయితే , బ్యాంకులు మాత్రం అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. గత వారం ఆరు జాతీయ బ్యాంకులకు చెందిన అధికారులతో వెలగపూడి సచివాలయంలో ఆర్థికశాఖ అధికారులు జరిపిన చర్చలు ఫలించలేదు. ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా రూ.25 వేల కోట్లు అప్పు దేవుడెరుగు, ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు రూ.6 వేల కోట్ల అప్పు ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులు కోరారు. అయినా అప్పు ఇచ్చేందుకు బ్యాంకర్లు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఏపీ అభివృద్ధి కార్పొరేషన్‌కు ఇచ్చే అప్పులకు ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇస్తుందని భరోసా ఇచ్చినా బ్యాంకులు మాత్రం అప్పు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ కు ఎలాంటి ఆస్తులు లేకపోవడం, ఆదాయం కూడా లేకపోవడంతో బ్యాంకులు అప్పులు ఇవ్వడానకి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
అప్పుల్లో మూడో స్థానం
దేశంలోనే అప్పులు చేయడంలో ఏపీ ప్రభుత్వం మూడో స్థానంలో నిలిచింది. అయినా వెనక్కు తగ్గడం లేదు. ఇంకా అప్పులు ఎలా చేయవచ్చనే అంశంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటూ, ఖర్చులు నియంత్రించుకుంటూ ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులను నడిపించాల్సిన ప్రభుత్వం కేవలం నవరత్నాల పేరుతో నగదు బదిలీకి తెర లేపింది. పదిహేడు నెలలు ఎలాగో నెట్టుకొచ్చారు. నేడు పరిస్థితి చేయిదాటి పోయింది. ఇక రాబోయే రోజుల్లో ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోందో ఊహించుకుని, ప్రభుత్వోద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు కొందరు పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నారు.
కుప్పకూలడం ఖాయం
ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, మరో రెండు నెలల్లో జీతాలు, పింఛన్లు కూడా ఇస్తారో లేదో అనుమానంగా ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుచ్చయ్య చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో 16 వేల గ్రామ సచివాలయాలు, 16 వేల రైతు భరోసా కేంద్రాలు, 12 వేల ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన నాడు నేడు కార్యక్రమం పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయని ఆయన విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.లక్షా పది వేల కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని, దీనికితోడు ఏపీ ప్రభుత్వానికి ఈ ఏడాది అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదని బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు.











