బుధవారం (14 అక్టోబర్) వరకు ఏపీకి కొత్త సీఎస్ గా నీరభ్ కుమార్ రానున్నారని అందరూ అనుకున్నారు. చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్) అధికారిగా నీరభ్ కుమార్ అక్టోబర్ 14 వరకు పని చేశారు. సీసీఎల్ అధికారిగా పనిచేసిన వారు చీఫ్ సెక్రటరీగా నియమితులు కావడం చాలా రోజుల నుంచి ఆనవాయితిగా వస్తోంది. అంతే కాకుండా ఐఏఎస్ లో అత్యంత సీనియర్ అధికారి నీరభ్ కుమార్ కావడంతో ఆయననే జగన్ ఏపీ సీఎస్ గా నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనను ఏపీ ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు బదిలీ చేసింది. ఆ శాఖ లోటుపాట్లపై నివేదిక ఇవ్వమని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
అస్మదీయులకే అందలం
సీసీఎల్ అధికారిగా నీరభ్ కుమార్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దాస్ నే జగన్ చీఫ్ సెక్రటరీగా నియమించనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న నీలం సహానీ పదవీకాలం ఎప్పుడో ముగిసింది. కానీ కరోనా మహమ్మారి ఉదృతి నేపథ్యంలో ఆమెకు ఎక్సటెన్షన్ లభించింది. ఇప్పటికే ఆమెకు ఆరు నెలలకు పైగా ఎక్సటెన్షన్ లభించింది. ఆమె పదవి కాలం త్వరలోనే పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో జగన్ చీఫ్ సెక్రటరీగా తమకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ను ఎంపిక చేసినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
దాస్ ఎవరంటే..
ఆదిత్యనాథ్ దాస్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆయన పలు కీలక శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. భారీ నీటి పారుదల శాఖ అధికారిగా పని చేసిన ఆయనపై జగన్ అక్రమాస్తుల కేసులో క్విడ్ ప్రోకోకి పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఆదిత్యనాథ్ దాస్‌ను విచారించేందుకు సీబీఐకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. దీంతో విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించకపోవడంతో ఆదిత్యానాథ్ దాస్‌పై మోపిన అభియోగాలను కొట్టివేసింది హైకోర్టు. దీంతో ఆదిత్యనాథ్ దాస్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలక శాఖ లభించింది. రాష్ట్ర విభజన సమయంలో ఆదిత్యనాథ్ దాస్ ఏపీ క్యాడర్ ను ఎంచుకున్నారు.
నీరభ్ కుమార్ కు చెక్
ఎల్జీ పాలిమర్స్ కేసులో విచారణ అధికారిగా ఏపీ ప్రభుత్వం నీరభ్ కుమార్ ను నియమించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిన ఆయన నేతృత్వంలోని కమిటీ ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన ఈ నివేదికను ఎటువంటి పక్షపాతానికి లోనుకాకుండా ఇవ్వడంతో జగన్ సర్కార్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టిందని ఆరోపణలు వినబడ్డాయి. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులపై కేసులు నమోదు చేయవలసి వచ్చింది. అందుకే నీరభ్ ను సీఎస్ గా నియమిస్తే ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో జగన్ దాస్ వైపు మొగ్గు చూపారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తన అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదురుకున్న అధికారులకు జగన్ పెద్ద పీట వేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. సమర్ధతకు కాకుండా అస్మదీయులకే అధికారం అప్పగించడం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.











