(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం తెలుగుదేశం పార్టీలో చిలికి చిలికి గాలి వానగా మారిన మనస్పర్ధల సెగ ఏకంగా అమరావతికి తాకింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకు చేరింది. దాంతో ఆయన ఘాటుగానే స్పందించారు. ‘అశోక్ గజపతి రాజు గారు నేను ఒకటే .. ఇద్దరిదీ ఒకటే నిర్ణయం.. ఆయనకు అవమానం జరిగితే నాకూ జరిగినట్టే.. ఆయన ఉన్నత శిఖరం.. దిగువ స్థాయి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. సమస్య పరిష్కారం అయినట్టే మీరు సంతోషంగా వెళ్ళండి’ అంటూ ఆయన వర్గీయులకు భరోసా ఇచ్చారు. దాంతో అధినేత ఎదుట తాడో పేడో తేల్చుకునేందుకు బుధవారం అమరావతి చేరుకున్న అశోక్ గజపతి వర్గీయులు ఆనందంతో వెనుదిరిగారు.
తారాస్థాయికి ..
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గ పోరు తారాస్థాయికి చేరింది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, అశోక్ గజపతి రాజుల మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తన అనుచరులతో కలిసి సొంతంగా పార్టీ కార్యాలయం ప్రారంభించడంతో వారి మధ్య మనస్పర్ధలు రోడ్డున పడ్డాయి. దీనిపై అశోక్ గజపతిరాజు, ఆయన వర్గీయులు అధిష్టానానికి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. అయితే అధిష్టానం నుంచి గాని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి గానీ సరైన చర్యలు లేకపోవడం, పార్టీ కార్యాలయం మూసివేయాలని ఆదేశాలు రాకపోవడంతో అశోక్ వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ విషయాన్ని వెలగపూడిలో అధినేత వద్దే తేల్చుకుందామన్న అశోక్ సూచనలతో నియోజకవర్గ నేతలు విజయవాడకు బస్సు, కార్లలో బయలుదేరి వెళ్లారు. అధినేత అపాయింట్‌మెంట్ బుధవారం లభించడంతో వారు చంద్రబాబుతో భేటీ అయ్యారు. నీతికి మారుపేరుగా, మచ్చలేని నాయకునిగా, పోలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్న అశోక్ గజపతిని అవమానించేలా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత వ్యవహరిస్తున్నారని, ఆయనకు ప్రత్యామ్నాయంగా పార్టీ కార్యాలయం ప్రారంభించారని అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు.
గీతకు లోపాయికారీ మద్దతు
మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు ఆ పార్టీ అధిష్టానం, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లోపాయికారీగా మద్దతు అందిస్తున్నారని తెలుగు తమ్ముళ్లే గుసగుస లాడుకుంటున్నారు. వారి ప్రొద్భలంతోనే ఆమె పార్టీ కార్యాలయం ప్రారంభించారని ఆమె వర్గీయులు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి సవివరంగా విజయనగరం పరిస్థితిని మీసాల గీత వివరించారని తెలిపారు. అశోక్ గజపతి ఒంటెద్దు పోకడలతో విసిగిపోయే సొంతంగా పార్టీ కార్యాలయం ప్రారంభించారని చెబుతున్నారు. అందువల్ల ఈ లొల్లికి ఇప్పటికైనా పుల్‌స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి.