రాజశేఖర్ కూతురు శివాని ఈ పాటికే తెలుగు తెరకి కథానాయికగా పరిచయం కావలసింది. కానీ ఆమె తొలి సినిమా కొన్ని కారణాల ఆగిపోయింది. అప్పటి నుంచి ఆమె ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణ త్వరలో ఫలించనుంది. ఆమె ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆయన నుంచి వచ్చిన ‘118’ సినిమా మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే.
కేవీ గుహన్ మంచి సినిమాటో గ్రాఫర్ .. తేజ మాదిరిగానే దర్శకత్వం దిశగా అడుగులు వేస్తూ వస్తున్నారు. అలా ఆయన ఇంతకుముందు కల్యాణ్ రామ్ హీరోగా ‘118’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. ఒక వైవిధ్యభరితమైన చిత్రంగా ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. దర్శకుడిగా ఈ సినిమా గుహన్ కి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. దాంతో ఆయన మరో సస్పెన్స్ థ్రిల్లర్ కి శ్రీకారం చుట్టాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా చివరిదశలో ఉండగా లాక్ డౌన్ వచ్చింది. ఆ కారణంగా ఆలస్యమైన ఈ సినిమా, ఇప్పుడు షూటింగు పార్టును పూర్తి చేసుకుంది.
గుహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అదిత్ అరుణ్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తుండగా, ఆయన జోడీగా శివాని కనిపిస్తుంది. బలమైన కథాకథనాలతో .. ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ప్రాణమనీ, ప్రతి సన్నివేశం ఉత్కంఠ భరితంగా ఉంటుందని అంటున్నారు. ‘118’ తో అభినందనలు అందుకున్న గుహన్, ఈ సినిమాను ఏ రేంజ్ లో ఆవిష్కరిస్తాడోననేది ఆసక్తికరంగా మారింది. ఇక రాజశేఖర్ కూతురు శివాని కథానాయికగా ఎంతవరకూ మెప్పించగలుగుతుందో చూడాలి.
Must Read ;- బాలకృష్ణతో తలపడే విలన్ గా రాజశేఖర్?