ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఏపీ మంత్రి నారా లోకేష్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక విషయంలో లోకేష్ తీసుకున్న చొరవపై ప్రశంసలు కురుస్తున్నాయి. లోకేష్..ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ఇదే మొదటి సారి కాదు. ట్విట్టర్‌లో సాయం కోసం చిన్న మెసేజ్ చేస్తే చాలు తానున్నానంటూ ముందుకు వస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలకు సైతం సాయం చేస్తూ తన గొప్పతనాన్ని చాటుకుంటున్నారు.
చిన్నారి పునర్విక వెన్నెముక కండరాల క్షీణత అనే అరుదైన వ్యాధితో పోరాడుతోంది. పాప ప్రాణాలు దక్కాలంటే 16 కోట్ల రూపాయల ఖరీదైన జోల్గెన్స్మా ఇంజెక్షన్ అత్యవసరం. దాతల సాయంతో ఆ తల్లిదండ్రులు 10 కోట్లు సేకరించినా, మిగతా 6 కోట్లు తక్కువ పడి దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో లోకేష్ వారికి పెద్ద దిక్కుగా మారారు. ఆ మిగిలిన రూ.6 కోట్ల రూపాయల భారాన్ని తాను తీసుకుంటానంటూ ముందుకు వచ్చారు.
లోకేష్ హామీ ఇచ్చి చేతులు దులుపుకోలేదు. ఆ ఆరు కోట్ల నిధిని వెంటనే సమకూర్చే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఇంజెక్షన్‌ను వీలైనంత త్వరగా విదేశాల నుంచి తెప్పించి, చిన్నారికి ఇప్పించేలా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన వైద్యం అనగానే చాలామంది నాయకులు సాంకేతిక కారణాలు చెప్పి వెనకడుగు వేస్తుంటారు. కానీ, ఒక తండ్రిగా ఆ బిడ్డ తల్లిదండ్రుల ఆవేదనను లోకేష్ మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారు. ఒక ప్రాణం నిలబెట్టడం ముందు ఆరు కోట్లు పెద్ద లెక్క కాదని నిరూపించి, రాజకీయం కంటే మానవత్వం గొప్పదని తన సేవా గుణాన్ని చాటుకున్నారు.
కష్టకాలంలో బాధితులు అడగకముందే స్పందించే లోకేష్ తీరుపై నెటిజన్లు, ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక నాయకుడికి ఉండాల్సిన అసలైన లక్షణాన్ని లోకేష్ చూపించారని కొనియాడుతున్నారు. ఆయన చూపిస్తున్న ఈ చిత్తశుద్ధి, ప్రజల్లో లోకేష్‌పై ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని మరింత రెట్టింపు చేసింది.











