వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల చేసిన కామెంట్ ఇది. ఇప్పుడు షర్మిల వ్యాఖ్యలు ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందో తెలియాలంటే.. జగన్ రెడ్డి ఆడుతున్న టెంపుల్ రన్ గేమ్‌లోకి వెళ్లాలి. పులివెందుల పర్యటనకు వెళ్లిన జగన్ రెడ్డి.. వేంపల్లె మండలం నందిపల్లి గ్రామంలోని నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ జరిగిన పూజలో కూర్చున్నారు. ఈ విజువల్స్ చూపించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నా.. హిందూ వ్యతిరేకి కాదు అనే ప్రచారం ప్రారంభించారు..
ఈ ప్రచారానికే షర్మల కామెంట్స్ వర్తిస్తాయి. ఒక వ్యక్తికి అధికారం ఇచ్చినప్పుడే అతని అసలు నైజం బయట పడుతుందని అబ్రహమ్ లింకన్ చెప్పారు. జగన్ రెడ్డి ఏపీ సీఎంగా అధికారంలో ఉన్న సమయంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగింది. రామతీర్ధంలో రాముల వారి విగ్రహం తల నరికేశారు.. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథం తగలబెట్టారు.. విజయవాడ కనకదుర్గ గుడిలో వెండి సింహాలు మాయమయ్యాయి. తిరుమల వెంకటేశ్వరస్వామి హుండీ సొమ్ముని దోచేశారు.. ఇలా చెప్పుకొంటూ పోతే.. హిందూ దేవాలయాల మీద ధర్మం మీద వందలాది దాడులు జరిగాయి. అయినా ఏ ఒక్క సంఘటన పైనా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అసలు వాటిని కనీసం పరిగణలోకి తీసుకోకుండా తీసి పారేసినట్లు మాట్లాడారు. ఇక ఆ కాలంలో ఏపీలో మత మార్పిడులు ఏ స్థాయిలో జరిగాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు..
కట్ చేస్తే అధికారం పోయిన తర్వాత తిరుమలలో వైసీపీ హయాంలో జరిగిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. స్వామి వారి ప్రసాదం తయారీకి వాడిన నెయ్యి అసలు నెయ్యే కాదని తేలింది. వెంకన్న భక్తుల్లో జగన్‌పై విపరీతమైన వ్యతిరేకత రావడంతో.. అధికారంలో ఉండగా గుడిసెట్టు వేసుకున్న మాజీ ముఖ్యమంత్రి.. ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో గుడికి వెళ్లాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ లబ్ది కోసం జగన్‌రెడ్డి ఆడుతున్న టెంపుల్ రన్ గేమ్‌ని చూపించి.. హిందూ ధర్మాన్ని ఉద్దరించినట్లు ప్రచారం చేసుకోవడం వైసీపీ వాళ్లు మాత్రమే చేయగలిగిన ఘనకార్యం. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనకు ఎవరైనా సతీసమేతంగా హాజరవుతారు. జగన్ మాత్రం ఒంటికొమ్ము సొంఠికాయలా.. లింగు లింగుమంటూ ఒక్కరే వెళ్లారు. సనాతన ధర్మం ఆచారాలు, సంప్రదాయాలపై ఆయనకున్న అవగాహన, గౌరవం ఏపాటివో ఇక్కడే అర్ధమైపోతోంది..
గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ రెడ్డి ఆడిన మరో భారీ డ్రామాను గుర్తు చేసుకొంటే.. పబ్లిక్ ముందు చేసే యాక్షన్‌కి.. మనసులో ఆలోచనలకు అసలు ఏమాత్రం పొంతన ఉండదని తెలుస్తుంది. 2019కి ముందు ఏపీ రాజధానిగా అమరావతికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నానని జగన్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పారు.. అదే మాటను ఎన్నికల ప్రచారంలో పదే పదే రిపీట్ చేశారు. కానీ గెలిచిన వెంటనే అమరావతిని చంపేయడానికి మూడు రాజధానుల గేమ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు గుళ్ల చుట్టూ తిరిగినా.. పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే.. టెంపుల్ రన్ కాస్తా టెంపుల్ డూమ్‌గా మారదన్న గ్యారెంటీ లేదు. మరి కరకట్ట కమల్‌హాసన్ యాక్టింగ్‌కి మరోసారి పడిపోతారా.. లేక ఆ నటన వెనకున్న నయవంచనను గుర్తిస్తారా అనేది ఏపీ ప్రజలే ఆలోచించుకోవాలి..











