దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది. లిక్కర్ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించిన ముప్పిడి అవినాష్ రెడ్డి చుట్టూ దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగించాయి. గత కొంతకాలంగా విదేశాల్లో తల దాచుకుంటున్న అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టును ఎదురుదెబ్బతగిలింది. దీంతో అవినాష్ రెడ్డికి ఇప్పుడు లొంగిపోవడం తప్ప మరో ఆప్షన్ లేదు.
జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీల రూపకల్పన నుంచి అమలు వరకు అంతా అవినాష్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం కొందరు ప్రైవేట్ వ్యక్తులకు, సిండికేట్లకు లాభం చేకూర్చేలా నిబంధనలను మార్చడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. రాజ్ కేసిరెడ్డితో కలిసి మద్యం తయారీదారుల నుండి వసూళ్లు చేయడం, ఆ నిధులను హవాలా మార్గాల్లో మళ్లించడంలో అవినాష్ రెడ్డిది కీ రోల్ అని దర్యాప్తులో తేలింది.
లిక్కర్ స్కామ్ బయటకు రాగానే విదేశాలకు పారిపోయిన అవినాష్ రెడ్డి…అక్కడి నుంచే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. ఇండియాకు తిరిగి వచ్చినా తనను అరెస్టు చేయకూడదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, చట్టం నుండి తప్పించుకుని పరారీలో ఉన్న వ్యక్తికి ముందస్తు రక్షణ కల్పించడం సాధ్యం కాదని కోర్టు కుండబద్దలు కొట్టింది. మరోవైపు, రాజ్ కేసిరెడ్డి బెయిల్ వ్యవహారం కూడా అవినాష్ రెడ్డి లొంగుబాటుపైనే ఆధారపడి ఉండటంతో, అవినాష్ ఇప్పుడు ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లిక్కర్ స్కామ్‌లో అవినాష్ రెడ్డి కేవలం మధ్యవర్తి మాత్రమే కాదు, ఈ స్కామ్‌లో జరిగిన ప్రతి పైసా లెక్క ఆయన దగ్గరే ఉంది. అవినాష్ రెడ్డి ఇండియాకు తిరిగి వచ్చి విచారణను ఎదుర్కొంటే, లిక్కర్ స్కామ్‌లో ఎవరెవరికి వాటాలు వెళ్లాయి.? తెరవెనుక చక్రం తిప్పిన అసలు రాజకీయ నాయకులు ఎవరనే సంచలన నిజాలు వెలుగులోకి రానున్నాయి. అవినాష్ రెడ్డి అరెస్టుతో ఈ కుంభకోణంలో పెద్ద తలకాయల పేర్లు బయటకు రావడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.











