వైసీపీ హయాంలో జరిగిన మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జగన్ పాలనలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాల్లో భారీ అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఒక్కొక్కరి దగ్గరా ఐదు లక్షల నుంచి పది లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. అప్పట్లో సచివాలయ ఉద్యోగ నియామకాల్లో 500 కోట్ల రూపాయలు చేతులు మారాయని సంచలన ఆరోపణలు చేశారు.
గ్రామ, వార్డు సెక్రటేరియట్ ఉద్యోగాల్లో 3,600 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. వీరిలో 1600 మంది కేవలం స్కూల్ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసిన కేటగిరిలో ఉద్యోగాలు పొందారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. స్కూల్, కాలేజీ గేమ్స్ ఆడారని చెప్పే సర్టిఫికేట్లు సమర్పించకపోయినా జాబ్స్ ఇచ్చేశారు. అప్పట్లో జరిగిన నియమకాలకు సంబంధించి రికార్డుల కోసం క్రీడాశాఖ అధికారులు వెతికితే.. ఉద్యోగాలు పొందిని వారికి సంబంధించిన వివరాలేవీ అందుబాటులో లేవని తేలింది. డీఎస్సీ మెరిట్ లిస్ట్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నా.. లేదని బుకాయిస్తున్న వైసీపీ నేతలు.. వారి హయాంలో జరిగిన నియామకాలకు సంబంధించిన రికార్డులను మాయం చేయడం ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది.
సచివాలయ ఉద్యోగాల్లో 90 శాతం మా వాళ్లకే ఇచ్చామని అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ఓపెన్‌గానే చెప్పారు. జగన్ కేబినెట్లో మంత్రులు, సీనియర్ నాయకులు వేలం పాటలు పెట్టి మరీ ఉద్యోగాలు అమ్ముకొన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అవినీతిపై ప్రభుత్వం తక్షణమే విచారణకు ఆదేశించాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా.. వైసీపీ హయాంలో జరిగిన అక్రమ నియామకాలపై విచారణకు ఆదేశాలు తెచ్చుకొంటామని అన్నారు.
అర్హత లేకపోయినా స్పోర్ట్స్ కోటాలో వేల మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించిన రాంగోపాల్‌రెడ్డి.. దీనిపై విచారణకు సిద్దమా అని జగన్‌కు సవాల్ విసిరారు. అత్యంత పారదర్శకంగా జరిగిన డీఎస్సీ నియామకాలపై ఫేక్ ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు.. సచివాలయ ఉద్యోగాల్లో జరిగిన అక్రమాలు వెలుగులోకి రావడంతో.. అడ్డంగా దొరికిపోయారు. జగన్ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షల్లో భారీగా అక్రమాలు జరిగాయని హైకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిర్ధారించింది. ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలకు బాధ్యత తీసుకొనేందుకు.. జగన్‌తో సహా వైసీపీ నాయకులెవరూ ముందుకు రావడం లేదు. కానీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా చూపించకుండానే ప్రభుత్వంపై ప్రతి రోజు బురద జల్లుతున్నారు.











