ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో పట్టిసీమ ప్రాజెక్టు కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఆదుకొంది. అలాంటి పట్టిసీమపై కొంతమంది సోషల్ మీడియాలో విష ప్రచారం మొదలుపెట్టారు. వైసీపీ సోషల్ మీడియాతో పాటు.. ఆ పార్టీకి సపోర్ట్ చేసే బీఆర్ఎస్ అనుకూల మీడియా కూడా పట్టిసీమపై అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో.. నాలుగైదు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి భారీ వరద రావడంతో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి కృష్ణా జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ వార్తను పట్టుకొని.. పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి.. తీసుకొచ్చిన గోదావరి జలాలను వృధాగా సముద్రలోకి వదిలేస్తున్నారని పింక్ మీడియాలో ఫేక్ ప్రచారం ప్రారంభించారు.
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో అప్రమత్తమైన ఏపీ జలవనరుల శాఖ అధికారులు.. వానలు పడటానికి మూడు రోజుల ముందే పట్టిసీమ పంపులు ఆపేశారు. భారీ వర్షాలతో మున్నేరు, కట్టలేరు వాగుల నుంచి కృష్ణా నదిలో కలిసిన వరద జలాలు ప్రకాశం బ్యారేజీకి చేరుతున్నాయి. మరోవైపు బుడమేరు ఉదృతంగా ప్రవహిస్తోంది. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు నీటిని ప్రకాశం బ్యారేజీకి మళ్లిస్తున్నారు.
పట్టిసీమ మోటార్లను మూడు రోజుల ముందే నిలిపివేసినా.. మున్నేరు, కట్టలేరు, బుడమేరు నుంచి వస్తున్న నీటితో ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న నీటిలో 10 వేల క్యూసెక్కుల వరకు డెల్టా కాలువలకు విడుదల చేస్తూ.. మిగిలిన జలాలను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లెత్తి సముద్రంలోకి నీటిని వదలడంతో.. పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి తీసుకొచ్చిన గోదావరి జలాలను వృధాగా సముద్రం పాలు చేస్తున్నారంటూ.. సోషల్ మీడియా ఫేక్ బ్యాచ్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది.
కృష్ణా నది సముద్రంలో కలిసే డెల్టా ప్రాంతానికి తగిన మొత్తంలో నీరు చేరకపోతే.. సముద్రం నీరు భూభాగంలోకి చొచ్చుకొని వస్తుంది. ఉప్పు నీరు ప్రవేశిస్తే.. డెల్టా ప్రాంతంలో భూగర్భ జలాలు వాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే సముద్రంలోకి వదిలే నీరు వృధా కాదు. అది తీర ప్రాంతంలో భూగర్బ జలాలను పరిరక్షిస్తుంది. అందుకే కృష్ణా నదికి సంబంధం లేకుండా కొల్లేరులో కలిసే బుడమేరు నీటిలో కొంత ప్రవాహాన్ని వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా ప్రకాశం బ్యారేజీకి మళ్లించి.. సముద్రంలోకి వదులుతున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతం, ఉప నదులు, బుడమేరు ప్రవాహదిశ, తీర ప్రాంత పర్యావరణ పరిస్థితుల గురించి కనీస అవగాహన లేని వాళ్లంతా.. ప్రకాశం బ్యారేజీ నుంచి వృధాగా సముద్రంలోకి నీటిని వదిలేస్తున్నారని తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకొంటున్నారు.











