చిత్తూరు విజయ డెయిరీనీ వెంటనే ప్రారంభించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి. జనార్ధన్, పి ఎల్ నర్సింహులు డిమాండ్ చేశారు. విజయ డెయిరీని మూత వేసి 18 సంవత్సరాలు పూర్తయిన ఇప్పటికీ పునః ప్రారంభించక పోవడంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం బైరాగి పట్టెడ సిపిఐ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ డెయిరీ అత్యధిక పాల సేకరణలో భారతదేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందన్నారు. అలాంటి సహకార రంగంలోని సంస్థను మూసివేసి ప్రైవేట్ ఫ్యాక్టరీలను ప్రోత్సహించడం జరిగిందన్నారు. వేలాది మంది పాడి రైతులు విజయ డెయిరీ కి పాలు సేకరించి పంపేవారని దానిని మూత వేయడంతో రైతులతో పాటు ఉద్యోగులు కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. నేడు ప్రైవేటు డెయిరీ లు సిండికేట్ గా మారి పాలకు గిట్టుబాటు ధర లేకుండా రైతును నిలువునా ముంచుతున్నాయి అని పేర్కొన్నారు.
కరోనా పరిస్థితుల్లో రైతుల నుండి లీటర్ పాలు కేవలం 20 రూపాయలకు ప్రైవేటు డెయిరీ లు కొనుగోలు చేస్తూ రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా చిత్తూరు విజయ డెయిరీ ని తాము అధికారంలోకి రాగానే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ విజయ డెయిరీ గురించి ప్రస్తావించడం లేదని అన్నారు. జగన్ ఇచ్చిన హామీ మేరకు తక్షణం విజయ డెయిరీ నీ తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పాడి రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, ప్రసదెం.ఎం. డి.ప్రసాద్, బండి చలపతి తదితరులు పాల్గొన్నారు.











