కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న వైసీపీకి త్వరలోనే గట్టి షాక్ తగలబోతోంది. తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రశాంతంగా సాగుతున్న DSC ప్రక్రియపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసీపీ కుట్రలు ఇప్పుడు బెడిసికొడుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో జగన్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల నియామకాల్లో జరిగిన భారీ అవకతవకలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
వైసీపీ హయాంలో వాలంటీర్ వ్యవస్థకు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లా తెచ్చిన సచివాలయ ఉద్యోగాల్లో అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అర్హులైన లక్షలాది మంది నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి, సొంత కేడర్‌కు, కార్యకర్తలకు ఉద్యోగాలు కట్టబెట్టుకున్నారనే ప్రచారం అప్పట్లోనే బలంగా నడిచింది. గతంలో పార్టీ ముఖ్య నేతగా ఉన్న విజయసాయిరెడ్డి స్వయంగా పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చుకున్నాం అని బహిరంగంగా వ్యాఖ్యానించిన ఉదంతాలను పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.
ముఖ్యంగా ఈ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా, నకిలీ సర్టిఫికెట్ల దందాపై ప్రభుత్వం సమగ్ర విచారణను వేగవంతం చేసింది. పశుసంవర్ధక శాఖలోని వెటర్నరీ అసిస్టెంట్లు సహా వివిధ విభాగాల్లో వేల సంఖ్యలో అభ్యర్థులు బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించారనే ఫిర్యాదులపై అంతర్గత తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్రీడా ధ్రువీకరణ పత్రాలు, ఇతర విద్యార్హతల సర్టిఫికెట్ల ప్రామాణికతను అధికారులు లోతుగా పరిశీలిస్తుండటంతో నాటి స్కామ్ గుట్టు త్వరలోనే రట్టు కానుంది.
డబ్బులు, రాజకీయ రంగు చూపి అర్హుల పొట్టకొట్టి ఉద్యోగాలు అమ్ముకున్నారనే వ్యవహారంపై నిజాలు బయటకు వస్తుండటంతో నాటి వైసీపీ పెద్దలకు దిమ్మతిరిగే షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక ఆధారాలను సేకరించిన విచారణాధికారులు త్వరలోనే పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని ఏరిపారేయడమే కాకుండా, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు వేగవంతం చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.











