ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో బోరున ఏడ్చేశారు. తన నీడన ఎదిగి, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పని చేసిన సొంత మేనల్లుడు మజ్జి శ్రీనివాస రావు వైసీపీకి రాజీనామా చేసి TDPలో చేరడాన్ని బొత్స జీర్ణించుకోలేకపోయారు. నమ్మినవాళ్లే మోసం చేశారు అంటూ కార్యకర్తలు, అనుచరుల మధ్య ఆయన గుక్కపెట్టి ఏడ్చేశారు. అధికారం, పదవుల కంటే కుటుంబ అనుబంధాలు, విలువలే ముఖ్యమని భావించే బొత్స లాంటి సీనియర్ నాయకుడు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది.
రాజకీయాల్లో విభేదాలు వచ్చినా, సొంత మనుషులు దూరమైనా తట్టుకోలేక బొత్స సత్యనారాయణ లాంటి నేతలు కన్నీళ్లు పెట్టుకోవడం వారిలోని మానవత్వాన్ని, అనుబంధాలకు ఇచ్చే విలువను తెలియజేస్తోంది. దశాబ్దాలుగా తోడుగా ఉన్న మేనల్లుడు ఒక్కసారిగా పార్టీని వీడిపోవడం వల్ల కలిగిన మానసిక ఆవేదన ఆయన కన్నీళ్లలో కనిపించింది. చివరికి తనను తాను సముదాయించుకుని పార్టీ మాత్రమే శాశ్వతం అని కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
ఐతే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. జగన్ కోసం, ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఒంటిచేత్తో పార్టీని భుజాన మోసిన సొంత చెల్లి వైఎస్ షర్మిలనే ఆయన స్వార్థ రాజకీయం కోసం పక్కన పెట్టేశారు. చివరికి ఆమెను పార్టీ నుంచి గెంటేసి, కనీసం ఏనాడూ బాధపడకపోగా, ఏమీ జరగనట్టే హ్యాపీగా గడిపేస్తున్నారు.
కష్టకాలంలో తోడుగా నిలిచిన చెల్లిని రాజకీయం కోసం పక్కన పడేసినప్పుడు జగన్ కంటి నుంచి కన్నీటి చుక్క కూడా రాలేదు. అధికార పీఠం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కనీసం రక్తసంబంధానికి కూడా విలువ ఇవ్వకుండా షర్మిలను దూరం చేసుకున్న ఆయనలో ఎలాంటి పశ్చాత్తాపం కానీ, మానసిక క్షోభ కానీ కనిపించలేదు. సొంత చెల్లెలికి అన్యాయం చేసి కూడా నవ్వుతూ కాలం గడిపేస్తున్న జగన్ మనస్తత్వానికి.. సొంత మేనల్లుడు దూరమయ్యాడని కంటతడి పెట్టుకున్న బొత్స వైఖరికి ఎంత తేడా ఉందో రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.











