తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా సాగుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై సోమవారం సాయంత్రం దుండగులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో చంద్రబాబుకు ఎలాంటి గాయాలు కాకున్నా… బాబు సభకు హాజరైన ఓ మహిళతో పాటు మరో యువకుడికి గాయాలయ్యాయి. ఊహించని ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన చంద్రబాబు… తన ప్రచార వాహనం మీద నుంచి దిగి అక్కడే నడిరోడ్డుపై బైఠాయించారు. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న తనకే రక్షణ లేకపోతే… ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఈ సందర్భంగా చంద్రబాబు ధ్వజమెత్తారు.
తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పనబాక లక్ష్మికి మద్దతుగా ప్రచారం సాగిస్తున్న చంద్రబాబు… ఇప్పటికే నెల్లూరు జిల్లా పరిధిలో ప్రచారం ముగించుకుని సోమవారం తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నగరంలో రోడ్ షో అనంతరం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు ప్రసంగం కొనసాగుతుండగానే… హఠాత్తుగా ఓ రాయి చంద్రబాబు మీదకు దూసుకొచ్చింది. అయితే ఆ రాయి చంద్రబాబును తగలలేదు గానీ…దాని వెంటే దూసుకువచ్చిన మరిన్ని రాళ్లు చంద్రబాబు సభకు హాజరైన జనంపై పడ్డాయి. ఈ దాడిలో ఓ మహిళతో పాటు మరో యువకుడికి గాయాలయ్యాయి.
ఊహించని ఈ ఘటనతో చంద్రబాబు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న తనకే రక్షణ లేకపోతే… ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ దాడికి నిరసనగా ఆయన తన వాహనంపై నుంచి దిగి అక్కడే నడిరోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడికి సూత్రధారులుగా వ్యవహరించిన వారిని కూడా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తంగా చంద్రబాబుపై రాళ్ల దాడి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.
Must Read ;- బాబు పిలుపు.. టీడీపీకి ఓటుతో జగన్ అరాచకానికి చరమ గీతం