నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని, దేశ సరిహద్దుల వరకు మారుమోగుతోందని నిరూపించే ఓ అరుదైన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వైసీపీ నేతలు అమరావతిపై ఎన్నో కుట్రలు, విషప్రచారాలు చేసినప్పటికీ, దేశ ప్రజల గుండెల్లో అమరావతి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మిగతా భారతదేశంతో భౌగోళికంగా పెద్దగా సంబంధాలు లేని లడఖ్ సరిహద్దు ప్రాంతంలో ఓ చిన్నారి నోటి నుంచి అమరావతి అనే మాట రావడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ప్రముఖ యూట్యూబర్ సుధీర్ కుమార్ లడఖ్‌లోని టుర్ టుక్ నుంచి న్యుబ్రా వైపు ప్రయాణిస్తుండగా ఈ ఆసక్తికర ఘటన జరిగింది. మార్గమధ్యంలో కొందరు స్థానిక పిల్లలు ఆయనను ఆపి సార్ షర్బత్ తాగండి అంటూ సుధీర్ కుమార్‌ను కోరారు. దానికి సుధీర్ ఎంత రేటు అని అడగగా.. మెహరం సందర్భంగా ఇది ఉచితం సార్, డబ్బులు ఏమీ వద్దంటూ పిల్లలు బదులిచ్చారు. దేశ సరిహద్దుల్లోని ఆ మారుమూల ప్రాంతంలో పిల్లలు చూపించిన ఆతిథ్యం, ప్రేమానురాగాలు ఆ యూట్యూబర్‌ను ఎంతో ఆకట్టుకున్నాయి.
ఇదంతా దూరం నుంచి గమనిస్తూ బురఖా ధరించి దగ్గరకు వచ్చిన ఒక మహిళ సుధీర్ కుమార్ వద్దకు వచ్చి మీది ఏ ఊరు అని ఆరా తీశారు. దానికి ఆయన నాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. వెంటనే పక్కనే ఉన్న చిన్నపిల్లలు అమరావతినా అని ఎదురు ప్రశ్నించారు. దేశానికి చిట్టచివరి మూలన ఉన్న లడఖ్‌లోని చిన్నారి నోటి నుంచి ఆంధ్రప్రదేశ్ అనగానే తడుముకోకుండా అమరావతి అనే పదం రావడం చూసి యూట్యూబర్ సుధీర్ కుమార్ ఆశ్చర్యపోతూ గర్వంగా ఫీల్ అయ్యారు.
అమరావతిని దెబ్బతీయాలని, దాని గుర్తింపును చెరిపేయాలని గతంలో వైసీపీ నేతలు ఎంతగా కుట్రలు పన్నినా, ప్రజా రాజధానిగా అమరావతి బ్రాండ్ ఇమేజ్ దేశమంతటా ఎలా విస్తరించిందో చెప్పడానికి ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనం. హిమాలయాల ఒడిలోని మారుమూల సరిహద్దు గ్రామాల పిల్లల మనస్సుల్లో సైతం AP అంటే అమరావతే అనే ముద్ర పడిపోయింది. ఈ అరుదైన సన్నివేశానికి సంబంధించిన ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.











