కొత్త రాష్ట్రం తెలంగాణలో వరుసగా రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తొలి దఫా పాలనలో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకున్నా… సెకెండ్ టెర్మ్ పాలనలో మాత్రం అన్నీ ఎదురు దెబ్బలు కొడుతున్నాయి. మొన్నటికి మొన్న తాను చేపట్టిన ఎల్ఆర్ఎస్ కేసీఆర్ పాలనకు చుక్కలు చూపగా… తాజాగా కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ధరణి వెబ్ పోర్టల్ మరింతగా చుక్కలు చూపిస్తోంది. ధరణి అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను ఎలా అధిగమించాలో కూడా తెలియని రీతిలో కేసీఆర్ నానా పాట్లు పడుతున్నారు. ఈ సమస్యలను ఎలాగోలా అధిగమిద్దామని భావిస్తున్న కేసీఆర్‌కు తాజాగా తెలంగాణ హైకోర్టు గట్టి ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి.
రెవెన్యూ చట్టాలను పూర్తిగా మార్చాలని..
తెలంగాణలో రెవెన్యూ చట్టాలను పూర్తిగా మార్చి వేద్దామని భావిస్తున్న కేసీఆర్… అందులో కీలకమైన భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా చేపట్టాలని, అవినీతిని సమూలంగా ప్రక్షాళన చేయాలని భావించారు. ఇందుకోసం ధరణి పేరిట ఓ బృహత్కార్యాన్ని మొదలుపెట్టారు. భూముల రిజిస్ట్రేషన్లలో అప్పటిదాకా లేని కొత్త తంతును మొదలెట్టేసిన కేసీఆర్… ఇకపై రిజిస్ట్రేషన్లను రిజిస్ట్రార్ ఆఫీసులతో పని లేకుండా ఏకంగా తహశీల్దార్ కార్యాలయాల్లోనూ పూర్తి చేసేలా నయా ప్లాన్ రచించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని మొత్తం భూముల వివరాలను ధరణి పేరిట కొత్తగా ఏర్పాటు చేసే వెబ్ సైట్‌లో పొందుపరచాలని కూడా కేసీఆర్ సర్కారు భావించింది. అయితే కొత్త పథకమన్నాక… కొన్ని ఇబ్బందులు తప్పనిసరే కదా. తొలుత కేసీఆర్ సర్కారు కూడా ధరణి అమలులో ఇబ్బందులు మామూలే అని భావించింది. అసలే రిజిస్ట్రేషన్లు, ఆపై భూములకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ ఇబ్బందులు అక్కడికక్కడ పరిష్కారం కాకపోగా.. పరిష్కారం లేని సమస్యలుగా పరిణమించాయి. వెరసి అసలు ఈ కొత్త తరహా పద్దతిని ఎందుకు ప్రారంభించాంరా బాబూ అన్న చందంగా కేసీఆర్ సర్కారు తల పట్టుకుని కూర్చుంది.
Must Read : పొత్తు తప్పదా.. బీజేపీ ట్రాప్‌లో కేసీఆర్, ఎంఐఎం పడినట్టే..
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లలో..
ధరణి అమలులో భాగంగా తొలుత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా ఊపింది. అందులో పెద్దగా ఇబ్బందులు రాకున్నా… అత్యంత విలువైన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల విషయానికి వచ్చే సరికి సమస్య మరింత జఠిలంగా మారింది. ఎక్కడికక్కడ ఒక్కో చోట ఒక్కో కొత్త సమస్య పుట్టుకొచ్చింది. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు స్లాట్‌లను ప్రకటించిన ప్రభుత్వం… ప్రకటించిన స్లాట్‌ల మేర రిజిస్ట్రేషన్లను కూడా చేయలేకపోతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న జనం బారులు తీరుతున్నారు. ఇలా వంద మంది వస్తుంటే… రిజిస్ట్రేషన్లు మాత్రం ఒకరికో, ఇద్దరికో పూర్తవుతున్నాయి. వెరసి మిగిలిన వారిలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. వారికి సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటుంటే… వారిని ఎలా సరిదిద్దాలో తెలియని ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు మరింతగా అయోమయంలో కూరుకుపోతున్నారు. వెరసి ఇప్పుడు ధరణి వల్ల ఏర్పడుతున్న సమస్యలను తీర్చడం, వాటికి పరిష్కార మార్గాలు దొరకకపోవడంతో కేసీఆర్ సర్కారు నిజంగానే సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది.
ఈ తరహా సమస్యలతో సర్కారు సతమతమవుతుంటే… మధ్యలో ఏవరో కోర్టుకు వెళ్లడం, కోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో కేసీఆర్ సర్కారు మరింత సంకటంలో పడిపోయిందని చెప్పాలి. ధరణిలో పొందుపరచిన కొన్ని అంశాలను తక్షణమే తొలగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో కేసీఆర్ సర్కారు కొట్టుమిట్టాడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వ్యవహారంపై కోర్టు అడిగిన ప్రశ్నలు, సందేహాలను తీర్చడానికి కూడా కేసీఆర్ సర్కారుకు చేతకావడం లేదన్న వాదనలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వెరసి ప్రభత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఆదాయం నిలిచిపోయింది. దీనితో పాటు జనంతో రేకెత్తుతున్న అసంతృప్తి, కోర్టులు లేవనెత్తుతున్న సందేహాల నివృత్తి కేసీఆర్ సర్కారును మరింత ఆందోళనలో పడేసిందనే చెప్పాలి.
ధరణి అమలులో ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు ఏవంటే..
* స్లాట్లను పరిమిత సంఖ్యలోనే ఇస్తుండటంతో సర్వర్లు ఇబ్బందులు పెడుతున్నాయి.
* ఖాళీ స్థలాలకు పూర్తి పన్ను కడితేనే రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తున్నారు.
* ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్లకు వివరాల నమోదు అవుతున్నా… రిజిస్ట్రేషన్ పూర్తి కావట్లేదు.
* మార్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ల కోసం డీడీ నెంబర్ ఇస్తే.. దానిని ఎంటర్ చేయడానికి అవకాశం లేదు.
* యజమాని మరణిస్తే వారి వారసుల పేర్ల నమోదుకు అవకాశం లేదు.
* బిల్డింగులు, ఫ్లాట్లు, మార్ట్ గేజ్, గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు మాత్రమే అవుతున్నాయి.
* కీలకమైన జీపీఏలకు అవకాశమే లేకుండా పోయింది.
* ఏదేనీ కారణంతో రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోతే… దానికి కట్టిన చలాన్ మురిగి పోతోంది. ఈ తరహా చలాన్‌కు గతంలో ఆరు నెలల వ్యవధి ఉండేది.
* ఎన్ఓసీ, బీఆర్ఎస్, బీపీఎస్, ఎల్ఆర్ఎస్, మున్సిపల్, విద్యుత్ శాఖల బిల్లుల చెల్లింపుల ధృవపత్రాలుంటేనే రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇస్తున్నారు.
* డాక్యుమెంట్‌లో నిర్మాణానికి సంబంధించిన పొడవు, వెడల్పు కొలతలు ఇవ్వట్లేదు.
*. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ప్రభుత్వం ఇచ్చే డాక్యుమెంట్, ఈ-పాస్ బుక్ సిటిజన్ లాగిన్‌లో కనిపించడం లేదు.
* సాక్షుల పేర్లు ముందే ఆన్ లైన్‌లో నమోదు చేయాల్సి వస్తుండటంతో… రిజిస్ట్రేషన్ సమయంలో వారిలో ఏ ఒక్కరు రాకపోయినా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోతోంది.
ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
ఈ తరహా ఇబ్బందులో సతమతమవుతున్న వినియోగదారులు… ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు మెట్టెక్కారు. దీంతో ఈ వ్యవహారంపై జోక్యం చేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం… ధరణి తీరు తెన్నులు, అందులో పేర్కొన్న నిబంధనలపై కాస్తంత లోతుగానే పరిశీలనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రిజిస్ట్రేషన్ సందర్భంగా ఆధార్ కార్డులు అడగడమేంటని కేసీఆర్ సర్కారును ప్రశ్నించింది. అంతేకాకుండా అస్తులు కొనేవారితో పాటు అమ్మే వారు, అందుకు సాక్షులుగా వస్తున్న వారి ఆధార్ కార్డులు తప్పనిసరిగా కావాల్సిందేనని అడగడం ఎంతవరకు సమంజసమని ధర్మాసనం ప్రశ్నించింది. ధరణి విధివిధానాల రూపకల్పన సందర్భంగా ఆధార్ కార్డులు అడగబోమంటూ హామీ ఇచ్చి మరీ… ఇప్పుడు దానిని ఎలా అతిక్రమిస్తారని కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఈ నిబంధనను తక్షణమే మాన్యువల్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు… అప్పటి దాకా స్లాట్ బుక్కింగ్ లను కూడా రద్దు చేయాలని షరతు పెట్టింది. మొత్తంగా ఆదిలోనే హంసపాదు అన్న చందంగా అట్టహాసంగా ప్రారంభిద్దామనుకున్న ధరణి పోర్టల్ తొలి దశలోనే కేసీఆర్ సర్కారుకు చుక్కలు చూపింది. మరి ఈ సమస్య నుంచి కేసీఆర్ సర్కారు ఎలా బయటపడుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే… ఈ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించి ధరణిని అమలు చేయడానికి బదులుగా కేసీఆర్ సర్కారు… వినియోగదారులు ఆధార్ నెంబర్లివ్వాల్సిందేనన్న కోణంలో ముందుకు సాగుతోంది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంటే సమస్యను పరిష్కరించడం కంటే కూడా దానిని మరింతగా పెంచేసేలానే కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: ఏ ముఖ్యమంత్రి ఇవ్వని వరాలు కేసీఆర్ ఇచ్చారు: ‘మనం సైతం’ కాదంబరి కిరణ్