ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసి సీఎం చంద్రబాబు సమక్షంలో TDPలో చేరారు. మజ్జి శ్రీనివాస రావు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు స్వయానా మేనల్లుడు. అంతేకాదు ఆయనకు ప్రధాన అనుచరుడు కూడా. ఐతే బొత్స సత్యనారాయణతో ఉన్న విభేదాలే ఈ పరిణామాలకు ప్రధాన కారణమని శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.
చిన్న శీను గత కొంతకాలంగా పార్టీలో ఎదురవుతున్న ఏకపక్ష నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్నారు. బొత్స తన కుమార్తె అనూష పేరును జడ్పీ ఛైర్మన్ పదవికి ప్రకటించడం, అటు చిన్న శ్రీను తన కుమార్తెను రాజకీయాల్లోకి తెచ్చి అదే పదవిపై కూర్చోబెట్టాలని భావించడం ఈ కుటుంబాల మధ్య దూరాన్ని మరింత పెంచింది.
పార్టీ వీడేందుకు చిన్న శ్రీను చాలాకాలంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం ద్వారా జిల్లాలో తన బలాన్ని నిరూపించుకున్నారు. అలాగే, జడ్పీటీసీ సభ్యులను వేరే రాష్ట్రానికి విహారయాత్రకు తీసుకెళ్లడం ద్వారా క్షేత్రస్థాయి క్యాడర్ తన వెంటే ఉండేలా పక్కా వ్యూహం రచించారు.
గత కొన్నేళ్లుగా ఉమ్మడి విజయనగరంలో వైసీపీ స్థానిక సంస్థల విజయాల వెనుక చిన్న శ్రీను శ్రమ ఎంతో ఉంది. జిల్లాలోని మెజారిటీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలపై ఆయనకు గట్టి పట్టుంది. ఇప్పుడు ఆయన హఠాత్తుగా పార్టీని వీడటంతో, ద్వితీయ శ్రేణి నాయకత్వమంతా ఆయన బాటలోనే నడిచే అవకాశం కనిపిస్తోంది. ఇది రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారనుంది.
ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కీలక నేతగా ఎదిగిన చిన్న శ్రీను చేరికతో తెలుగుదేశం పార్టీ మరింత బలపడనుంది. వైసీపీలో కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందనే భావనతోనే ఆయన ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఉద్ధండుడైన నేత హ్యాండివ్వడంతో ఉత్తరాంధ్రలో వైసీపీకి గడ్డుకాలమే అని విశ్లేషకులు భావిస్తున్నారు..











