ఆరడుగుల ఆజానుబాహుడు.. అందగాడు. అభినయంలో సాటిలేని మేటి. విలక్షణమైన పాత్రలు, వైవిధ్యమైన కథలతో ఎన్నో సెన్సేషనల్ మూవీస్ చేసి బాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యారు. ఏడుపదుల వయసులోనూ ఎనలేని ఎర్జీతో తెరమీద చెలరేగడం ఆయనకే చెల్లింది. పేరు అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ లో ఇప్పటికీ ఆయన సినిమాలకు ఓరేంజ్ లో క్రేజ్ ఉండడం ఆయన గొప్పతనం. ఏ పాత్ర పోషించినా అందులో పెర్ఫెక్షనిస్ట్ ఆయన. ఏ సన్నివేశంలో నటించినా.. అందులో తన మార్క్ చూపిస్తాడాయన. నవ్వించినా, నర్తించినా ,ప్రేమించినా, కోపగించినా.. దానికి విలక్షణతను తీసుకురావడం ఆయన స్టైల్. అందుకే పద్మవిభూషణ్ , దాదాసాహెబ్ పాల్కే అవార్డులు ఆయన్ను వరించి తరించాయి.
అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్.. హిందీ భాషా పండితుడు. ఆయన తన కలం పేరు ‘బచ్చన్’ ను అమితాబ్ కు ఇంటిపేరుగా పెట్టారు. ఢీల్లీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అమితాబ్. తల్లీ తేజీ బచ్చన్ కు నటనమీద ఉన్న ఆసక్తి తనయుడు అమితాబ్ కూ అబ్బింది. దాంతో ఆయనకి సినిమాల మీద మక్కువ ఎక్కువైంది. 1969 లో ప్రముఖ దర్శకుడు మృణాళ్ సేన్ నిర్మించిన జాతీయ అవార్డు చిత్రం ‘భువన్ షోమ్’ కు తన గళాన్ని అందించి.. తన సినీ రంగ ప్రవేశానికి బాటలు వేసుకున్నారు అమితాబ్. ఆ ఏడాదే ‘సాత్ హిందూస్థానీ’ సినిమాతో బాలీవుడ్ తెరపై దర్శనమిచ్చారు. సినిమాకు జాతీయ అవార్డు వచ్చినా అమితాబ్ కు ఈ సినిమాతో అంతగా పేరేమీ రాలేదు.
అయితే 1971లో విడుదలైన ఆనంద్ సినిమాతో అమితాబ్ మంచి పేరు తెచ్చుకున్నారు. రాజేష్ ఖన్నాతో స్ర్కీన్ షేర్ చేసుకొన్నా.. అమితాబ్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ‘పర్వానా, ప్యార్ కీ కహానీ, రేష్మా ఔర్ షేరా, గుడ్డి’ సినిమాలతో ఆయనకి మరింత క్రేజ్ ఏర్పడింది. ఆపై ‘బోంబే టు గోవా’ సినిమా సూపర్ హిట్ తో అమితాబ్ కు తొలి బ్రేక్ వచ్చింది.
దర్శక నిర్మాత ప్రకాష్ మెహ్రా 1973 లో ‘జంజీర్’ సినిమా నిర్మించారు. సలీం జావేద్ రచన చేసిన ఈ సినిమా అమితాబ్ ను ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ గా నిలబెట్టింది.. ఈ సినిమా బాలీవుడ్ లో ఒక నూతన శకానికి అంకురార్పణ జరిపిందని చెప్పవచ్చు. దీని తరవాత హిందీలో ఉద్రేక పూరిత సినిమాలు రావడం మొదలైంది.
ఇక 1975 లో అమితాబ్ నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి ‘దీవార్’, మరొకటి ‘షోలే’. ’దీవార్’ సినిమాలో అమితాబ్ నట విశ్వరూపం చూపించారు. ఇదొక బాలీవుడ్ మాస్టర్ పీస్ గా చెప్పవచ్చు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ బహుమతి గెలుచుకుంది. ఈ సినిమా ఎంత పాపులర్ అయ్యిందంటే తెలుగులో ‘మగాడు’ పేరుతో, తమిళంలో ‘తీ’ పేరుతో, మలయాళం లో ‘నది ముదల్ నది వరే’ గా రీమేక్ అయింది.
ఇక ‘షోలే’ సెన్సేషన్ విషయానికొస్తే , జయదేవ్ పాత్రను అమితాబ్, వీరూ పాత్రను ధర్మేంద్ర పోషించారు. ‘షోలే’ సినిమాను 1925-75 మధ్యకాలంలో వచ్చిన అత్యుత్తమ సినిమాగా ఫిలింఫేర్ మ్యాగజైన్ పేర్కొనడం విశేషం. ఆ తర్వాత ‘చుప్ కే చుప్ కే’, ‘దో అంజానే’ ‘కభీ కభీ’, ‘హీరా ఫేరి’, ‘అదాలత్’,‘అమర్ అక్బర్ ఆంథోని’ ‘పర్వరీష్’ ‘త్రిశూల్’, ‘డాన్’, ‘మిస్టర్ నట్వర్ లాల్’, ‘కాలా పత్తర్’, ‘దోస్తానా’, ‘లావారిస్’ సినిమాలు వరుసగా సూపర్ హిట్స్.. అమితాబ్ కు బాలీవుడ్ లో తిరుగులేని సూపర్ స్టార్ డమ్ ను తెచ్చిపెట్టాయి. ఆపై మరిన్ని సినిమాలతో అమితాబ్ బాలీవుడ్ ను ఏలారు.
ఇక ‘ఖుదా గవా’ సినిమాలో నటించాక ఐదేళ్ళు సినిమా నటనకు విరామం ప్రకటించారు. ఆ విరామ సమయంలో ‘అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్’ స్థాపించి సినిమాల నిర్మాణం, పంపిణీ, ఆడియోల విడుదల వంటి కమర్షియల్ వ్యాపారం మొదలుపెట్టారు. కానీ అందులో నష్టాలు వచ్చాయి.
2000 నుంచి సపోర్టింగ్ పాత్రలు, వైవిధ్య మైన పాత్రలు పోషిస్తూ వచ్చారు. 2001 లో వచ్చిన ‘కభి ఖుషి కభి ఘమ్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘అక్స్’ సినిమాలో నటనకు ఫిలింఫేర్ బహుమతి దక్కించుకున్నారు. ‘’బ్లాక్’ సినిమాలో నటనకు జాతీయ బహుమతి లభించింది. 2009లో వచ్చిన ‘పా’ సినిమాలో నటనకు ఫిలింఫేర్ అవార్డ్ లభించింది.
2013 లో ‘ది గ్రేట్ గట్స్ బై’ అనే హాలీవుడ్ సినిమాలో నటించారు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కి సారధ్యం వహించారు. లండన్, న్యూయార్క్, హాంగ్ కాంగ్, బ్యాంకాక్, వాషింగ్టన్, ఢిల్లీ నగరాలలోని మేడం టుస్సాడ్ మ్యూజియంలలో అమితాబ్ బచ్చన్ మైనపు బొమ్మలను ఆవిష్కరించారు. అలా.. అమితాబ్ బచ్చన్ ఏడుపదులు వచ్చినా కూడా.. ఇప్పటికీ ఇంకా , తన నటనా పటిమను ప్రదర్శిస్తునే ఉన్నారు. నేడు అమితాబ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా లియో న్యూస్ ఆ అభినయ బచ్చన్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది.