తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. పాలన ప్రస్తుతం ఎలా ఉందని అడిగితే కొందరు బాగుందని అనవచ్చు.. మరికొందరు బాగోలేదని చెప్పవచ్చు. అది వేరేవిషయం. ప్రస్తుత పాలన తీరు ఎలా ఉన్నప్పటికినీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావానికి తరువాత అని ఓ విభజన రేఖ గీసి రాజకీయ చరిత్రనే తిరగరాసిన ఘనుడు కేసీఆర్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దశబ్దాల కాలం నాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నావను ఒడ్డుకు చేర్చిన నావికుడు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో కేసీఆర్‌తో ఎన్నో శక్తులు కలిసి పోరాటం చేసినా కానీ మెజార్టీ క్రెడిట్ మాత్రం అది కేసీఆర్‌కే దక్కుతోంది. ఇది ఎవ్వరూ కాదలేని సత్యం.
ప్రత్యేక రాష్ట్రమే తన ఊపిరిగా ఉద్యమాన్ని గడపగడపకు తీసుకెళ్లి అన్ని వర్గాల ప్రజలను ఏకతాటికి తీసుకొచ్చేలా కేసీఆర్ ముఖ్యభూమిక పోషించారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తనతో వచ్చిన వారిని వెంట తీసుకెళ్లి ఆ ప్రయాణంలో ఎన్నో ఎదురు దెబ్బలు, ఎత్తుపళ్లాలు చూశారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ప్రజల్లో బలంగా వెళ్లిన రోజులవి. అప్పటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ వ్యాప్తంగా ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రపాలకుల పాలనలో దగాపడ్డ తెలంగాణలో మా బతుకులు మారే రోజులు ఇక రావా? అని అందరి మదిలో ఒక భయం.. బాధ.. ఆక్రోశం.. ఆవేశం.. ఆందోళనలు కదలాడుతున్నాయి.. ఇంకా ఎన్ని ఏళ్లు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలి అనే ఆవేదనలు అందరి మదిలో మెదులుతున్నాయి. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఎగిసిపడి చల్లారిన ఉద్యమం తాలూకు జ్ఞాపకాలు అందరినీ అప్పటికే కలిచివేస్తున్నాయి. 1969లో కోట్లాడినం.. మళ్లీ ఇప్పుడు 40 ఏళ్ల తరువాత ఉద్యమం పురుడుపోసుకుంది. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు మన తెలంగాణ వచ్చేది. ఇక మన తెలంగాణ రాదా? ఇవ్వరా? లాంటి వంద ఆలోచనలు, ప్రశ్నలతో తెలంగాణ సమాజం మొత్తం ఆవేదన.. ఆవేశంతో రగిలిపోతుంది. అప్పటికే ఉస్మానియా, కాకతీయ, ఇతర జిల్లాలల యూనివర్శిటీలకు ఉద్యమ సెగ తాకింది.
Must Read: తెలంగాణ నేతలకు భయపడుతున్న ఏపీ టీడీపీ నేతలు!
తెలంగాణ రాష్ట్రం కోసం నాలుగు కోట్ల ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్న క్షణాలవి. ఏదోకటి చేయాలనే ఆలోచన అందరి మదిని తొలచివేస్తున్న ఘడియలవి. ఒకవైపు టీఆర్ఎస్ దళపతి, ఉద్యమ నేతలు నేతలు, తెలంగాణ మేధావులు తెలంగాణ కోసం కొట్లాడుతుంటే మరోవైపు తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నీరుగార్చాలని కొందరు ఆంధ్రా నేతలు కుట్రలకు తెరతీసారు. ఈ సమయంలో అందరి చూపు కేసీఆర్ వైపు.. ఏం చేయబోతున్నాడోనని. అప్పుడే కేసీఆర్ ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకుని తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షకు ఒక బాట వేశారు. అదే నవంబర్ 29, 2009. కేసీఆర్ సచ్చుడో… తెలంగాణ ఇచ్చుడో అని ప్రకటించి అమరణ నిరాహర దీక్షకు పూనుకున్నాడు. మొదట ఈ నిర్ణయంపై కొందరిలో భిన్నవాదనలు వినిపించినా.. రోజులు గడుస్తున్న కొద్దీ ఉద్యమం ఉగ్రరూపం దాల్చుకుంది. కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎప్పుడు ఏమవుతుందోనని తెలంగాణ సమాజం మొత్తం ఎదరు చూస్తోంది. విద్యార్థులు, ఉద్యమకారులు, మేథావులు, కులమతాలకు అతీతంగ ఉద్యమం గడపగడపు చేరుకుంది. జనం ప్రభంజనమై రోడ్లపైకి ఉద్యమ కెరటాలుగా చేరి ఉద్యమం చేస్తున్నారు. ఎన్నో నాటకీయ పరిణామాలు కేసీఆర్ దీక్ష కేంద్రంగా చోటు చేసుకున్నాయి. అరెస్టులు, లాఠీఛార్జీలు, భాష్పవాయు గోళాలు ఉద్యమాన్ని ఆపలేకపోయాయి. చివరకు ఢిల్లీ మెడలు వంచి నాలుగు కోట్ల ప్రజానికం ఎదురు చూస్తున్న ప్రకటన ఢీల్లీ నుంచి వెలువడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లు, ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.
కోట్లాది మంది తెలంగాణ ప్రజల ముఖంలో విరిసిన చిరునవ్వులతో ఒక్క సారిగా తెలంగాణ ప్రాంతమంతా ప్రకాశించింది. ఊరువాడ సంబురాలు అంబరాన్ని అంటాయి. మనం కలలు కన్న తెలంగాణ ఇక సాకారమైందనే సంతోషం విరబూసింది. ప్రకటన తరువాత నిమ్మరసమిచ్చి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను మేథావులు విరమింపజేశారు.
కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ప్రారంభమైన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష(దీక్షా- దివస్)కు ఈ రోజుతో 11 ఏళ్లు(సెప్టెంబర్ 29, 2009) పూర్తి. యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఢిల్లీ పునాదులను గడగడ లాడించి, మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన రోజును అందరం ఒక్క సారి గుర్తుకు తెచ్చుకుందాం. ఈ రోజును గుర్తు చేసుకుంటూ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. దీక్షా దివస్ స్ఫూర్తితో తెలంగాణ ప్రగతికి పునరంకితమవుదాం. కేసీఆర్‌కి అండగా ఉందామంటూ కవిత పేర్కొన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజాంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజానీకానికి దీక్షా దివస్ శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.











