తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త కష్టాలొచ్చాయి. ఏం కష్టాలనుకుంటున్నారా.. అదే దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో నట. ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ కి గ్రౌండ్‌లోకి దిగాక అసలు కష్టాలు మొదలయ్యాయట. ఇంచార్జ్‌లుగా నియమితులైన నేతలు గాంధీ భవన్‌కు వచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. కదనరంగంలోకి పక్కా ప్లాన్‌తో దిగిన కాంగ్రెస్, అభ్యర్థి ఎంపికతో పాటు ఎన్నికల ఇంచార్జ్‌ల నియామకం వరకు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. పార్టీ అభ్యర్థిగా దివంగత చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డిని బరిలో నిలబెట్టింది. నియోజకవర్గంలో చెరుకు కుటుంబానికి మంచి పేరు ఉండటంతో ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని భావించింది. అంతేగాక గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని దుబ్బాక బరిలో ప్రచారానికి దింపింది. ప్రతి గ్రామానికి ఒక నేతను ఇంచార్జ్‌గా.. మండలానికి నలుగురు సీనియర్ నేతలను సమన్వయం చేసుకునేందుకు నియమించింది.
మద్ధతు లభించక ఉక్కిరిబిక్కిరి
చూడటానికి ఇదంతా బాగానే ఉన్నా.. గ్రౌండ్‌లో దిగితే కాని అసలు సినిమా తత్వం బోధపడలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. దుబ్బాకలో కాంగ్రెస్‌కు ఒక నాయకత్వం అంటూ లేకపోవడంతో క్యాడర్ అంతా చెల్లా చెదురయిందట. ఎన్నికల ప్రచారం చేసేందుకు వెళ్లిన నేతలకు సినిమా కష్టాలు ఎదురవుతున్నాయట. ఇంచార్జ్‌గా వెళ్లిన వారికి స్థానికంగా మద్ధతు లభించక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. ఇంచార్జ్ గా ఉన్న ఒక నేత గాంధీ భవన్‌కు వచ్చి గోడు వెళ్లబోసుకున్నాడు. మిర్‌దొడ్డి మండలంలో ఇంచార్జిగా అప్పగించిన గ్రామానికి వెళ్తే సదరు నేతకు ఏం చేయాలో అర్థం కాలేదట. గ్రామంలో మూడు పోలింగ్ బూతులు ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి అతికష్టం మీద ఇద్దరు మాత్రమే దొరికారట. ప్రచారానికి పరిస్థితి ఇలా ఉంటే, పోలింగ్ నాటికి ఏజెంట్‌ల పరిస్థితి ఏంటో ఊహించడానికి కష్టంగా ఉందంటూ సదరు నేత ఆవేదన వ్యక్తం చేశారు.
పరువు పోయే పరిస్థితి
ఇదంతా ఒక ఎత్తయితే.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్ ప్రెజర్ నేతలపై మరింతగా ఉంటోందట. ఠాగూర్ వరుసగా సమీక్షలు పెట్టడం, ఇంచార్జ్‌లు ఎన్నికల ఖర్చు పెట్టాలని టార్గెట్‌లు పెడుతుండటంతో ఏం చేయాలో పాలు పోవడం లేదని వాపోతున్నారు. ఫైనల్‌గా ఎన్నికల రిజల్ట్ ఏందనేది ఇప్పుడే కళ్ల ముందు కదలాడుతోందని.. గ్రామానికి ఒక ఇంచార్జిని పెట్టినా పరువు పోయే పరిస్థితి ఉందని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.











