ప్రపంచాన్ని గడగడలాడించిన అనేక వ్యాధులకు టీకాలతో సమాధానం చెప్పారు శాస్త్రవేత్తలు. ఏడాదిగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు కూడా టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటిదాకా అనుమతులు పొందిన టీకాల్లో కొన్ని సంక్లిష్టతలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి రెండు డోసులు తీసుకోవాల్సి రావడం, మైనస్ 76 డిగ్రీల వద్ద మందు నిల్వ చేయాల్సి రావడం, టీకా సమర్థత కేవలం 90 శాతమే ఉండటం, టీకా ధర ఇవన్నీ ప్రతిబంధకాలుగా మారాయి. ప్రస్తుత ధరల ప్రకారం ప్రపంచంలోని 800 కోట్ల మందికి కరోనా రెండు డోసుల టీకా వేయాలంటే 4 లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది.
కనీసం ఏడాది పాటు లక్షలాది మంది వైద్య నిపుణులు ఈ యజ్ఙం చేయాల్సి ఉంది. అందుకే అమెరికాలోని స్టాన్ ఫోర్ట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఒకే డోసుతో కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. అంతేకాదు. దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ టీకాను గది ఉష్ణోగ్రత వద్ద కూడా నిల్వ చేయవచ్చు. తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయవచ్చని స్టాన్ ఫోర్ట్ శాస్త్రవేత్తలు నిరూపించారు. ఎలుకలపై ఇది విజయవంతంగా పనిచేసిందని వారు ప్రకటించారు. పేద దేశాలకు ఇది ఎంతో అనువైన టీకాగా వారు అభివర్ణించారు.
మనటీకా.. మనకు రక్ష
అమెరికాలోని స్టాన్‌ఫోర్డు యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన టీకా అందుబాటులోకి రావడానికి ఇంకా కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎలుకల మీద విజయం సాధించిన ఈ టీకాను ఇంకా అనేక రకాలుగా పరీక్షించాల్సి ఉంది. క్లినికల్ ట్రయల్స్ కూడా చాలా కీలకం. ఈ లోగా అమెరికాలోని ఫైజర్, భారత్ లోని సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆరు కంపెనీల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే అమెరికాలో పెద్ద ఎత్తున టీకా వేసే కార్యక్రమం ఊపందుకుంది. భారత్ లోనూ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది.
ముఖ్యంగా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్, అంటే వైద్యులు, వైద్య సిబ్బందికి టీకాలు వేయాలని నిర్ణయించారు. కరోనా బారిన పడే ప్రమాదం వారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ ప్రకటించారు. రాజకీయ నాయకులు కూడా టీకా కోసం ఒత్తిడి చేయవద్దని ఆయన విజ్ఙప్తి చేశారు. భారత్‌లోనూ సాధారణ ప్రజలందరికీ టీకా కార్యక్రమం పూర్తి చేసేందుకు కనీసం సంవత్సర కాలం పడుతుందని అంచనా. 30 కోట్ల మందికి టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అంటే మిగిలిన 106 కోట్ల మందికి టీకా వేయరా అంటే.. అందరికీ టీకా ఇస్తారు. కానీ రిస్క్ ఎక్కువగా ఉన్న వారికి ముందు వరుసలో ఇచ్చుకుంటూ వస్తారన్న మాట. ఈ లోగా చౌకగా ఒకేసారి ఇచ్చే స్టాన్ ఫర్డ్ టీకా అందుబాటులోకి వస్తే, భారత్ కూడా దిగుమతి చేసుకునే అవకాశం లేకపోలేదు. అప్పుడు టీకా ప్రక్రియ మరింత సులువవుతుంది.
ముక్కు ద్వారా కరోనా టీకా..
భారత్ బయోటెక్ ఇప్పటికే కోవాగ్జిన్ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చింది. రెండు డోసులు తీసుకోవడం ద్వారా 90 శాతం కరోనా నుంచి రక్షణ లభిస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. అంతేకాదు.. రాబోయే కొద్ది రోజుల్లోనే ముక్కు ద్వారా కరోనా టీకా తీసుకునే మందును ఆవిష్కరించనున్నట్టు ఆ సంస్థ ఎండీ ప్రకటించారు. అదే జరిగితే ప్రపంచ దేశాలకు భారత్ చౌకైన, సురక్షితమైన టీకా అందించినట్టవుతుంది. మరో ఆరు నెలల్లో ఈ టీకా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అన్ని అవకాశాలు సద్వినియోగం..
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వేగాన్ని అదుపు చేసి, కట్టడి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాల్సిందే. ఇప్పటికే కరోనా రెండో దశ వ్యాప్తితో ఇంగ్లాడ్ దేశం వణికిపోతోంది. ఇలాంటి పరిస్థితి మన దేశంలో వస్తే వైద్యం అందించేందుకు వైద్యులు కూడా భయపడే పరిస్థితి దాపురిస్తుంది. అందుకే ముందుగా వారం, పది రోజుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా అందించాలని నిర్ణయించారు. ముందు వారు సేఫ్‌గా ఉంటే, కరోనా బాధితులకు వైద్యం చేయడం సులువవుతుంది.
దేనికదే ప్రత్యేకత..
సహజంగా టీకాలు ఆవిష్కరించేందుకు కనీసం 2 సంవత్సరాల సమయం పడుతుంది. చైనాలో కరోనా బయట పడి సంవత్సరం దాటింది. అప్పటి నుంచి కరోనా టీకా కోసం ప్రయోగాలు ప్రారంభమయ్యాయని భావించినా, ఇప్పటికి గట్టిగా సంవత్సరం అవుతుంది. అంటే సంవత్సరంలో టీకా తీసుకురావడం సాహసమే. అందుకే కరోనా టీకా మూడో దశ ప్రయోగాలు సాగుతూ ఉండగానే, ముందస్తు వినియోగానికి అనేక దేశాలు అనుమతి ఇచ్చాయి. రాబోయే సంవత్సర కాలంలో కరోనా టీకా ధర తగ్గడంతోపాటు, ఒకే డోసు సరిపోయే టీకా కూడా అందరికీ అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.











