గ్రామ పర్యటనకు, ఎన్నికల ప్రచారానికి నేతలు వెళ్లినప్పుడు వారికి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. మంచి నీటి సమస్యనో, రోడ్ల సమస్యనో ఇలా తమ గ్రామ సమస్యలు పరిష్కరించలేదని నేతలను అడ్డుకోవడం, ప్రశ్నించడం లాంటివి చేస్తుంటారు. అయితే వారి సమస్యలను సాదరంగా విని పరిష్కరించే ప్రయత్నం నాయకులు చేయాలి. లేదు అలాకాకుండా ప్రశ్నించే వారి నోళ్లు ముయ్యాలని చూస్తే వచ్చే నష్టం పార్టీ నాయకులకే అనే విషయం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఓటు అనే అస్త్రం ప్రజల చేతుల్లో ఉంటుంది కాబట్టి. అదే నేతల గెలుపు ఓటములను నిర్ధేశిస్తుంది కాబట్టి. అలా ప్రవర్తించడం తమ విజయానికే కాదు వ్యక్తిత్వానికి కూడా డ్యామేజ్ చేస్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే…అంథోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సహనం కోల్పోయి ప్రవర్తించారు. సొంత పార్టీ కార్యకర్తపైనే ఆయన చేయిచేసుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తోగుట మండలం వెంకట్రావుపేటలో చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈనెల 20 ఆదివారం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వెంకట్రావుపేటలో కార్యకర్తలను కలిసేందకు వెళ్లారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సిలివేరి మల్లారెడ్డి కూడా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే క్రాంతి కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈలోపు కనకరాజు అనే కార్యకర్త తనకు పార్టీలో సభ్యత్వం ఇవ్వకపోవడంపై మల్లారెడ్డిని నిలదీశారు. దీంతో అతడిపై అసహనానికి గురైన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కనకరాజుపై చేయిచేసుకున్నారు. దీంతో అక్కడున్న గ్రామస్థులంతా ఎమ్మెల్యేను నిలదీశారు. మా ఊరికొచ్చి మా పిల్లలపై చేయి చేసుకుంటావా? అంటూ ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి క్రాంతిని నిలదీశారు. దీంతో చేసేది ఏమీలేక ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. సమావేశంలో గొడవ జరగకుండా తాను కనకరాజు భుజంపై చేయి వేసి సముదాయించానని, అతనిపై చేయి చేసుకోలేదని ఎమ్మెల్యే ఆ తరువాత వివరణ ఇచ్చుకున్నారు.
సభ్యత్వం విషయం గురించి ప్రశ్నిస్తే కార్యకర్తపై ఓ ఎమ్మెల్యే చేయి చేసుకోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తపై వ్యవహరించిన ఆయన తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలుగానీ, ప్రజలు గానీ ప్రశ్నిస్తే నేతలు వారికి ఓపికగా సమాధానం చెప్పాలేగానీ ఇలా చేయి చేసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేస్తే తమ ఇమేజ్ కే డ్యామేజ్ అవుతోందనే విషయం నేతలు గుర్తు పెట్టుకోవాలని జనం పేర్కొంటున్నారు.











