విజయవాడ శివారు నున్నలో కాల్పులు కలకలం రేపాయి. నగర పోలీస్ కమిషనరేట్లో గుమస్తాగా పనిచేస్తున్న మహేష్ ను స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగులు పాయింట్ బ్లాంక్ లో కాల్పి చంపారు. నున్న బైపాస్ వద్ద వైన్ షాపు సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఘటన జరిగిన వెంటనే విజయవాడ సీపీ శ్రీనివాసులు సంఘటనా తీరును పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కాల్పుల ఘటనలో హరి అనే మరో వ్యక్తి కూడా గాయ పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ హరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటన వెనుక అనేక అనుమానాలు…
విజయవాడ శివారు నున్నలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో సంఘటనా స్థలంలోనే చనిపోయిన మహేష్ అనే పోలీసు శాఖ ఉద్యోగికి 2015లో వివాహమైంది. కుటుంబంలో గొడవలు చోటుచేసుకోవడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత మహేష్ ఓ డాక్టర్ తో ప్రేమలో పడ్డాడని తెలుస్తోంది. మహేష్ హత్య వెనుక కుటుంబ కలహాలా, లేదా ఏదైనా భూ వివాదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఉలిక్కిపడ్డ విజయవాడ
కాల్పుల ఘటనతో విజయవాడ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తుపాకీ కాల్పులతో ఓ వ్యక్తిని హతమార్చడం బెజవాడలో ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి కావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మహేష్ పై సుపారీ గ్యాంగ్ కాల్పులకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతోపాటు, మహేష్ కు భూవివాదాలు, వడ్డీ వ్యాపారాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో కాల్పులు చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.