సినిమా యాక్టర్లకు, రాజకీయ నాయకులకు సామాన్య ప్రజలు అభిమానులుగా ఉంటారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు బడా పారిశ్రామికవేత్తలే పెద్ద ఫ్యాన్స్. వేలు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్లు కూడా బాబుగారికి వీరాభిమానులే. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో బాబుగారికి ఇచ్చిన ఎలివేషనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. చంద్రబాబు అన్‌స్టాపబుల్ అని.. ఆయనంటే తనకు ఎందుకు అంత అభిమానమో వివరిస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు ఆనంద్ మహీంద్రా. దశాబ్దాల తరబడి డెవలప్‌మెంట్ కోసం చంద్రబాబు పడే తపన చూశానని.. అంతకు మించి ప్రభుత్వ పాలసీలను కొత్తగా.. అందరికీ అనుకూలంగా మార్చడానికి ఆయన చూపించే ఆసక్తి.. తనను ఆయనకు మరింత పెద్ద అభిమానిగా మార్చిందని చెప్పుకొచ్చారు. ఈ మనిషి అన్‌స్టాపబుల్ ఫోర్స్.. ఇది ఆయన సహజ స్వభావం అని పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా.
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో అనేక కొత్త పాలసీలను ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌లో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడలే లక్ష్యంగా ఈ విధానాలను రూపొందించారు. ముఖ్యంగా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు అందించడానికి ప్రత్యేకంగా ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ ఎస్క్రో అకౌంట్ విషయంలోనే ఆనంద్ మహీంద్రా.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. వేల కోట్లు పెట్టుబడిగా పెట్టాలనుకొనే ఇండస్ట్రియలిస్టులకు.. తమ పెట్టుబడులపై గ్యారెంటీతో పాటు ప్రభుత్వంపై నమ్మకం కలిగించడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది.
విశాఖ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. మహీంద్రా గ్రూపు నుంచి సోలార్ ఎనర్జీ, మైక్రో ఇరిగేషన్, టూరిజం రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టనున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని జహీరాబాద్‌లో మహీంద్రా ట్రాక్టర్ల తయారీ పరిశ్రమ నెలకొల్పింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న జహీరాబాద్ ఫ్యాక్టరీలో ఏడాదికి లక్ష ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తున్నారు. భవిష్యత్తులో మహీంద్రా ఆటోమొబైల్స్.. ఐటీ సంస్థలను ఏపీకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది











