వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మను దూరం పెడుతున్నారు. కన్నతల్లి కంటే ఆస్తులు, రాజకీయాలే ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరయ్యేందుకు.. జగన్ హైదరాబాద్ CBI కోర్టుకు వచ్చిన విషయం తెలిసిందే. విచిత్రంగా ఈ పర్యటన కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ కూడా చేశారు. ఐతే ఈ పర్యటనలో హైదరాబాద్‌లోనే ఉన్న తల్లి విజయమ్మ గురించి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
షెడ్యూల్ ఇలా –
షెడ్యూల్ ప్రకారం జగన్ రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లిలో బయలుదేరారు. ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. అక్కడనుంచి నాంపల్లి కోర్టుకు చేరుకుని..అక్కడ పన్నెండున్నర వరకు ఉంటానని షెడ్యూల్‌లో ప్రకటించారు. గంట సేపు మాత్రమే కోర్టుకు సమయం కేటాయించారు. తర్వాత తిరిగి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తిరుగుపయనమవుతారని షెడ్యూల్‌లో చెప్పారు. కానీ కన్న తల్లివిజయమ్మ హైదరాబాద్‌లోనే ఉంటే కనీసం పలకరించకుండానే వెనుదిరుగుతున్నారు జగన్.
వై.ఎస్ ఫ్యామిలీలో జగన్, షర్మిల మధ్య మొదలైన ఆస్తుల వివాదాలు కుటుంబాన్ని మూడు ముక్కలు చేశాయి. ప్రధానంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ల బదిలీ అంశం చిచ్చు రేపింది. సరస్వతీ పవర్ షేర్ల విషయంలో తల్లిని కోర్టుకు లాగారు జగన్. చెల్లి షర్మిలతో పాటు తల్లి విజయమ్మను ప్రతివాదులుగా చేర్చారు. సరస్వతి పవర్ కంపెనీ షేర్లను 2021లో జగన్..తల్లి విజయమ్మకు గిఫ్ట్ డీడ్‌ల రూపంలో బదలాయించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ షేర్లను విజయమ్మ, షర్మిలకు బదిలీ చేశారని, అయితే ఈ బదిలీలు చెల్లవని, తన వాటా తమకు తిరిగి ఇవ్వాలని కోరుతూ జగన్ NCLTను ఆశ్రయించారు. ఒకప్పుడు ప్రేమతో ఇచ్చిన కానుకను ఇప్పుడు జగన్ వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు. ఈ వివాదం కారణంగా తల్లిని దూరం పెడుతున్నారు జగన్.
జగన్, భారతీ రెడ్డి వైఖరి కారణంగా విజయమ్మ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. చివరిసారిగా సెప్టెంబర్ 2న వై.ఎస్. వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఎదురుపడ్డారు జగన్, విజయమ్మ. ఈ సందర్భంగా విజయమ్మ జగన్‌ను ఆప్యాయంగా పలకరించే ప్రయత్నం చేశారు. కానీ, జగన్ విజయమ్మను పెద్దగా పట్టించుకోలేదు. కనీసం తల్లిని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయలేదు. మొత్తంగా ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని దూరం చేసుకున్నారు జగన్. కోర్టు విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ ఆయనకు విజయమ్మను కలవాలనే ఆలోచన రాకపోవడం శోచనీయం. దీన్ని బట్టి జగన్ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు











