వైసీపీ బూతు బ్రదర్స్‌పై జగన్ సీరియస్ అయ్యారంట. నిజమేనండి.. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండగా గాలి కూతలతో రెచ్చిపోయిన.. వల్లభనేని వంశీ, కొడాలి నాని మీద పార్టీ అధినేత గరం గరంగా ఉన్నారంట. అప్పట్లో వీళ్ల బూతులకు మెచ్చి ఒకరికి రెండున్నరేళ్ల పాటు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు మాత్రం వాళ్లపై యమా సీరియస్‌గా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు జగన్‌కి నమ్మిన బంటుల్లా పని చేసిన వీరిపై ఇప్పుడు ఎందుకంత కోపం వచ్చిందంటే.. చాలా విషయాలు చెప్పుకోవాల్సి వస్తుంది.
జగన్ సీఎం పదవిలో ఉన్నాడు.. వైసీపీ అధికారంలో ఉందని.. నోటికి అడ్డూ అదుపు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్.. జనసేనాని పవన్‌కళ్యాణ్‌లను అడ్డమైన మాటలు అన్నారు. ప్రజలు ఫ్యాన్ పవర్ కట్ చేశాక.. వీళ్ల నోళ్లకూ తాళం పడింది. కానీ గతంలో చేసిన ఓవర్ యాక్షన్‌కి.. కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన కౌంటర్ యాక్షన్ దెబ్బకు వీళ్లకు చుక్కలు కనిపించాయి. కొడాలి నానికి గుండెపోటు రావడంతో.. ఆపరేషన్ చేయించుకొని హైదరాబాద్‌లో రెస్ట్ తీసుకొంటున్నారు. వల్లభనేని వంశీ అరాచకాలపై వరుస కేసులు పెట్టడంతో.. ఆయనా చేతులెత్తేసి.. హైదరాబాద్‌కి మకాం మార్చారట.
మాజీలయ్యాక గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో వీళ్ల ఆచూకీ దొరకడం లేదని పార్టీ కార్యకర్తలే వెతుక్కొనే పరిస్థితి వచ్చింది. మరోవైపు కూటమి నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన టీడీపీ నేతలు ఈ నియోజకవర్గాల్లో దూసుకెళ్తున్నారు. వైసీపీ పరిస్థితేమో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న పార్టీ అధినేత జగన్.. కొడాలి నాని, వల్లభనేని వంశీలకు అల్టిమేటమ్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ ఓడిపోయి ఏడాదిన్నర గడిచింది.. హనీమూన్ పీరియడ్ ఎప్పుడో అయిపోయింది.. ఇకనైనా నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉండాలని లేకపోతే.. కొత్త ఇంఛార్జ్‌లను చూసుకొంటానని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 20 మందికీ ఇలాంటి వార్నింగులే వెళ్లాయని సమాచారం. ఇప్పటికీ ఇనాక్టివ్‌గా ఉన్నా చాలా మంది తాజా మాజీలను తాడేపల్లి ప్యాలెస్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారని వైసీపీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. జగనే ఇంకా పూర్తిగా యాక్టివ్ కాకపోవడంతో.. ఎమ్మెల్యేల్లో ఎంత మంది యాక్టివ్‌గా ఫీల్డ్‌లోకి వస్తారో చూడాలి











