మూఢం.. ఈ మాటను అందరూ ఎన్నోసార్లు వినే ఉంటారు. అసలు ఈ మూఢం అంటే ఏమిటి? ఈ సమయంలో ఏమేం పనులు చేయవచ్చు, ఏమేం చేయకూడదు, ఒక వేళ చేస్తే ఏమవుతుంది? లాంటి అనేక సందేహాలకు సమాధానం తెలుసుకుందాం. శుభ కార్యాలు చేయడానికి వీలుపడని రోజులను మూఢంగా చెబుతుంటారు. ఆ పదానికి ఉన్న అర్థం లోకి వస్తే మనం ఏ పని చేయడానికైనా పనికి రాని కాలం లేదా విడిచి పెట్టే కాలంగా భావించవచ్చు. ఈ మూఢాలు రెండు రకాలు. ఒకటి గురు మూఢం, రెండోది శుక్ర మూఢం. మూఢాన్ని మౌఢ్యం అని కూడా వ్యవహరిస్తుంటారు.
మొన్ననే గురు మౌఢ్యం తొలగిపోయింది. ఒక రోజు ఇలా గ్యాప్ వచ్చిందో లేదో శుక్ర మౌఢ్యం వచ్చేసింది. వచ్చే మే 4వ తేదీ వరకూ ఈ శుక్ర మౌఢ్యం కొనసాగుతుంది. అసలు మూఢం ఎందుకొస్తుందో చూద్దాం. జ్యోతిష పరంగా గురు, శుక్రలు శుభ గ్రహాలు. వివాహం, వ్యాపారం లాంటి శుభ కార్యాలు తలపెట్టినప్పుడు ఈ గ్రహాలు బలంగా ఉండటం కూడా అవసరం. ఈ గ్రహాలు బలహీనమైన సమయంలో ఏ పని తలపెట్టినా అది విజయవంతం కాదన్నది పెద్దల నమ్మకం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ రెండు గ్రహాలు బలహీనమయ్యే సమయాలు కొన్ని వస్తుంటాయి. గ్రహాలకు రాజు సూర్యుడే కదా.
ఆ సూర్యడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతుంటాయి. అందుకే దీనికి మూఢం అనే పేరు పెట్టి శుభ కార్యాలకు దూరంగా ఉండమని మన జ్యోతిష వేత్తలు చెబుతుంటారు. ఈ మూఢాన్నే జ్యోతిష పరిభాషలో అస్తంగత్వం అని కూడా అంటుంటారు. అలా దగ్గర వచ్చినప్పుడు ఈ గ్రహాల శక్తి తగ్గిపోతుంది. వెయ్యి వాట్స్ బల్బ్ ముందు చిన్న క్యాండిల్ పెడితే ఎలా ఉంటుందో ఊహించండి. అలాంటిదే ఇది కూడా.
మరి ఈ మూఢం వచ్చినప్పుడు ఏమేం పనులు చేయకూడదో చూద్దాం. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాల ప్రారంభం వంటి శుభకార్యాలకు జనం ఈ సమయంలో దూరంగా ఉంటుంటారు. అందువల్ల ఈ మూఢం సమయంలో ఎక్కువగా వివాహాలు జరపరు. పంచాంగ కర్తలు కూడా ఈ సమయంలో ముహూర్తాలు రాయరు. లగ్న పత్రికలు అసలే రాయరు. మరి కొందరైతే పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకు రావడానికి కూడా భయపడుతుంటారు. పుట్టు వెంట్రుకలు కూడా కొందరు తీయరు. ఒకప్పుడు వీటినన్నిటినీ చేయకూడదని జ్యోతిష వేత్తలు చెప్పేవారు.
మూఢం వచ్చింది కదా అని మరీ మూఢంగా వ్యవహరించే వారు కూడా ఎక్కువే. పట్టింపులు అవసరమే కానీ పట్టువిడుపులు కూడా ఉండాలి. పెళ్లిళ్ల ప్రస్తావన తేవడం కూడా తప్పే అంటే ఎలా? ప్రస్తుత కాలంలో పెళ్లి చూపులు కూడా చూస్తుంటున్నారు. నిజానికి దీనికి శాస్త్రం కూడా ఏమీ అడ్డు చెప్పలేదు. గృహ శంకుస్థాపనలు, వివాహం లాంటి శుభకార్యాలు జరపకుండా ఉంటేనే మంచిది. ఈ పట్టింపులేని ఇతర మతాల వారు నిరభ్యంతరంగా వారు ఏదైనా చేసుకోవచ్చు.
ఈ మూఢంలో ఏమేం చేసుకోవచ్చో అనేది కూడా చూద్దాం. గృహ ప్రవేశం చేయవద్దన్నారుగానీ అద్దె ఇళ్లు మారవద్దని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. అయ్యవారు వచ్చేదాకా అమావాశ్య ఆగదు కదా. కొన్ని కార్యక్రమాలను అనవసరంగా వాయిదాలు వేసుకోవడం చేయవద్దు. చిన్న పిల్లలకు అన్నప్రాశన మూఢంలో చేసుకోవచ్చు. ప్రయాణాలు చేయవచ్చు. ఇంటికి మరమ్మతులు చేసుకోవచ్చు. ఎలాంటి రిపేర్లు అయినా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. చిన్న చిన్న వ్యాపారలు ప్రారంభించుకోవచ్చు. కారులు, మోటారు సైకిళ్లు లాంటి వాహనాలను కొనుగోలు చేయవచ్చు. కొత్త బట్టలు కొనుక్కోవడం కూడా చేయవచ్చు.
శుభ కార్యాలు చేయవద్దని మన పెద్దలు చెప్పడం వెనక కూడా కొంత అర్థం ఉండి తీరుతుంది. ఈ సమయంలో చేయడం వల్ల ఏవైనా అశుభ వార్తల్ని వినవచ్చన్న భయం కూడా కొంత కారణం. వ్యాపారాలు ప్రారంభిస్తే నష్టం వస్తుందేమోనన్న భయం.. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉంటుంటారు. ఏదేమైనా ముందు జాగ్రత్త కూడా మంచిదే. అలాగే ప్రతి విషయాన్నీ మూఢంతో ముడిపెట్టడం ఎంత మాత్రమూ మంచిది కాదు. మన సమయం కూడా విలువైనది అనే విషయాన్ని మరచిపోవద్దు.