‘బ్యాడ్ బాయ్ బిలియనీర్లు’ వెబ్ సిరీస్ ఎట్టకేలకు జనం ముందుకు వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా నెట్ ఫ్లిక్స్ ఓ సంచలనానికి తెరతీసింది. సెప్టెంబరు 2న ప్రసారం కావలసిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ చివరికి అక్టోబరు 2 నుంచి ప్రారంభమైంది. కాకపోతే సత్యం రామలింగరాజు కు సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ ను మాత్రం నిలుపుదల చేశారు. ఇప్పటిదాకా ఈ వెబ్ సిరీస్ పై స్టే ఉంది. బీహార్ లోని దిగువ కోర్టు ఈ స్టే ఎత్తివేసిన తర్వాత దీని ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఇది వివాదాస్పద వెబ్ సిరీస్ కావడం వల్ల అందరి దృష్టీ దీని మీద ఉంది. ఈ సమాజంలో ఉండే వైట్ కాలర్ నేరగాళ్లు ఎలాంటి మోసాలు చేస్తున్నారన్నదే ఇందులో ప్రధాన అంశం.
విజయ్ మాల్య, నీరవ్ మోడీ, సహారా ఇండియా చీఫ్ సుబ్రతా రాయ్, మెహుల్ చోక్సీ లాంటివారు చేసిన మోసాలపై ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ ముగ్గురి ఎపిసోడ్ లను నెట్ ఫిక్స్ ప్రసారం చేసింది. సత్యం రామలింగరాజుకు సంబంధించిన అంశం హైదరాబాద్ కోర్టులో పెండింగులో ఉంది. సుబ్రతా రాయ్ తనపై ఈ వెబ్ సిరీస్ రూపొందించారని వేసిన పిటిషన్ ను అరియారియా జిల్లా కోర్టు పరిశీలించింది. ఈ ఎపిసోడ్ ను పరిశీలించిన కోర్టు ఇందులో ఆయన పేరు ఎక్కడా ప్రస్తావించనందున దీనిపై ఉన్న స్టే ఎత్తివేసింది. ఈ సిరీస్ తన ఇమేజ్ ను దెబ్బతీస్తోందన్న రాయ్ ఆరోపణను కోర్టు పట్టించుకోలేదు.
నెట్ ఫ్లిక్స్ మాత్రం ఇవన్నీ తమ పరిశోధనాత్మక కథనాలని అంటోంది. చోక్సీ కరేబియన్ ఐలండ్ కు చెందిన వ్యక్తి. రెండు బిలియన్ డాలర్ల పిఎన్‌బి కుంభకోణంలో చోక్సీ నిందితుడు. ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు కూడా చుక్కెదురైంది. చోక్సీ న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. దాంతో మూడు ఎపిసోడ్ ల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఓటీటీ కంటెంట్ ను భారత ప్రభుత్వం నియంత్రించదన్న నెట్ ఫ్లిక్స్ వాదనను కోర్టు కూడా సమర్థించింది.
జనబాహుళ్యంలో ఉన్న అంశాలే ఇందులో ఉన్నాయని, ఇది డాక్యుమెంటరీ లాంటిదని అమెరికన్ టెక్నాలజీ, మీడియా సర్వీసెస్ ప్రొవైడర్ కూడా అభిప్రాయపడింది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కిందికే వస్తుందని పేర్కొంది. సత్యం రాజు అంశంపై కూడా కోర్టు నుంచి ఆదేశాలు వస్తే ప్రసారం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సత్యం రాజుకు సంబంధించినంత వరకు ఇంకా స్టే కొనసాగుతోంది.











