కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.. కొత్త డ్రామాలకు తెర తీసింది. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ ఆధారాలు లేని ఆరోపణలు చేసి అడ్డంగా దొరికిపోయినా.. తప్పుడు కథనాలతో జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ మధ్యే బులుగు రంగు పూసుకున్న మరో మీడియా సంస్థ ద్వారా.. మెగా డీఎస్సీపై కొత్త కుట్రలతో రచ్చ చేస్తున్నారు.
స్పోర్ట్స్ కోటాలో మొత్తం 421 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తే.. అర్హులైన 372 మందికి మాత్రమే టీచర్ జాబ్స్ దక్కాయి. ఈ ఉద్యోగాలన్నీ కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చేశారని ఆరోపణలు చేసిన వైసీపీ..కేవలం 9 జాబ్స్ మాత్రమే కమ్మ వారికి వచ్చాయని, రెడ్లకు 10, కాపు సామాజిక వర్గానికి 16.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 340 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం ఆధారాలు, లెక్కలతో సహా వివరించడంతో.. తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారు.
కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన ఒక టీచర్ సమర్పించిన టెట్ సర్టిఫికేట్‌పై అధికారులకు అనుమానం వచ్చి వెరిఫై చేయడంతో అది ఫేక్ అని తేలింది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క అభ్యర్ధి తప్పు చేస్తే.. మొత్తం డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన దాదాపు 16 వేల మంది విషయంలోనూ అక్రమాలు జరిగాయన్నట్లు ప్రచారం చేస్తున్న వైసీపీ.. కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్లకు తీవ్ర మనోవేదన కలిగిస్తోంది.
డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులందరికీ సంబంధించిన వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఎక్కడైనా అక్రమాలు జరిగాయని ఆధారాలు ఉంటే.. నేరుగా కోర్టులో కేసులు వేయొచ్చు. వైసీపీ నాయకులు కోర్టులకు వెళ్లినా.. సాక్ష్యాలు చూపించలేక పోవడంతో వాళ్ల పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. అధికారుల ముందు, కోర్టుల్లో డీఎస్సీలో అక్రమాలు జరిగాయని రుజువు చేయలేకపోయినా.. ఉద్యోగాలు పొందిన టీచర్ల సర్టిఫికేట్లు చూపించాలని బిగ్ టీవీ, సా*క్షి టీవీ ఉద్యోగులు.. ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. ఎవరి విషయంలో అయినా అనుమానాలు ఉంటే.. పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.. కోర్టులో పిటిషన్లు వేయొచ్చు. అంతేగానీ.. స్కూల్లో పని చేసుకొంటున్న వారిని వేధించడం.. అన్యాయం, అమానుషమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వలేదు. జగన్ పాలనలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్ష వాల్యుయేషన్‌లో అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారు. ప్రైవేటు రిసార్టులో ఆటో డ్రైవర్లు, వంట వాళ్లతో పేపర్లను దిద్దించి కోర్టుతో చీవాట్లు తిన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మెగా డీఎస్సీలో ఇలాంటి అక్రమాలేవీ జరగలేదు. అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి.. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేసి.. వెనుకబడిన, బడుగు, బలహీన వర్గాలకు అత్యధిక మేలు జరిగేలా చూశారు. వైసీపీ ప్రభుత్వం గ్రూప్ వన్ నియామకాల్లో తప్పు చేసి అడ్డంగా దొరికిపోవడంతో.. కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా.. సొంత మీడియా, పేటీఎం పెయిడ్ ఆర్టిస్టులతో డీఎస్సీపై ఫేక్ ప్రచారాలు చేసి.. బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ క్రెడిబులిటీ లేని అమ్ముడుపోయిన మీడియా.. ప్రజల విశ్వాసం కోల్పోయిన వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఎవరూ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.











