ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లను తగ్గించడం.. సినీ ప్రముఖులు టిక్కెట్ల రేట్లను పెంచాలని డిమాండ్ చేయడం ఎంత వివాదాస్పదం అయ్యిందో తెలిసిందే. కరోనా వలన చిత్ర పరిశ్రమ బాగా దెబ్బతిన్నది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇలాంటి టైమ్ లో టిక్కెట్ల రేట్లను తగ్గించడం వల్ల చిత్ర పరిశ్రమకు బాగా నష్టం వస్తుందని ఎంత చెప్పినా.. ప్రభుత్వం మాత్రం టిక్కెట్ల రేట్లు తగ్గించడం పై చర్చలతోనే సరిపెడుతుంది తప్ప సరైన నిర్ణయం తీసుకోవడం లేదు.
చిత్ర పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పై విమర్శలు వస్తున్నాయి. ఈ టిక్కెట్ల విషయం గురించి చర్చించేందుకు ఇటీవల ఏపీ మంత్రి పేర్ని నానితో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అవ్వడం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ రోజు జరిగిన అఖండ విజయోత్సవంలో బాలయ్య ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లను తగ్గించడం గురించి మాట్లాడుతూ.. ఈ వివాదం పై చిత్ర పరిశ్రమ కలిసికట్టుగా ఉండాలన్నారు.
చిత్ర పరిశ్రమ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడే ఉంటాను అన్నారు. అలాగే.. చిత్ర పరిశ్రమ సమస్యల గురించి పట్టించుకునే నాధుడే లేడు అక్కడ అంటూ బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది. మరి.. బాలయ్య వ్యాఖ్యల పై ఇటు చిత్ర పరిశ్రమలో కానీ.. అటు ప్రభుత్వంలో కానీ.. ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.











