ఎఫ్పుడూ తనను నెత్తిన పెట్టుకుని అధికారం అందించే కడప జిల్లా మొత్తం సర్వనాశనం అయిపోతోంటే అక్కడి ప్రజలతో మాట్లాడడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టైం లేకపోయిందా? కనీసం రెండు గంటల సమయం కూడా కేటాయించకుండా.. కేవలం హెలికాప్టర్ లో రెండు జిల్లాలను చుట్టేసి.. తూతూమంత్రంగా వరద ప్రాంతాల్లో పర్యటించాను అని ముఖ్యమంత్రి బుకాయిస్తున్నారా? రెండు జిల్లాలు పూర్తిగా అతలాకుతలం అయిపోతే.. కనీసం వారి కన్నీళ్లను చూడడానికి కూడా టైంలేనంతగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? అంత బిజీ ఏమిటి? అనే సందేహాలకు సరైన సమాధానమే ఉంది.
సీఎం ఆఫీసు ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం కడపలో ఆయన హెలికాప్టర్ ఎక్కడం దగ్గరినుంచి తిరుపతి విమానాశ్రయంలో దిగడం వరకు వరద ప్రాంతాలను పరిశీలించడానికి కేటాయించిన సమయం సరిగ్గా 1.40 నిమిషాలు. నిజానికి పర్యటన అంతకంటె త్వరంగానే ముగిసింది. కడపలో ఎన్డీఆర్ఎఫ్ వారితో మాట్లాడారు. కడప, తిరుపతి ఎయిర్ పోర్టులలో నాయకులు, అధికార్లతో వరద నష్టం గురించి మాట్లాడారు.
జగన్మోహన్ రెడ్డి శనివారం వరదబాధిత ప్రాంతాల టూర్ రోజున చాలా బిజీబిజీ పనుల షెడ్యూల్ ఉంది. పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణంతో ఆమెను పరామర్శించడానికి వెళ్లారు. ఎంత బిజీ పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రతి రోజూ కనీసం గంటసేపు జిమ్ చేసే అలవాటు ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ఉదయం కరీమున్నీసా మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అక్కడినుంచి వరద ప్రాంతాల పర్యటనకు బయల్దేరారు. తిరిగి వచ్చాక సాయంత్రం ఆయనకు మరో కార్యక్రమం ఉంది. ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కొడకు పెళ్లికి హాజరయ్యారు.
ఓకేగానీ.. వరద బాధిత ప్రాంతాల్లో ఇంకొంత సమయం గడిపిఉండొచ్చు కదా అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ విషయం ఏంటంటే.. ఆయనకు మధ్యలో మరో డీల్ ఉంది. వరదప్రాంతాలనుంచి తిరిగి తాడేపల్లికి 3 గంటలకు వచ్చిన జగన్, పారిశ్రామిక వేత్త అదానీతో సమావేశం అయ్యారు. సాయంత్రం 5.30 గంటల దాకా వారి భేటీ సాగింది. తర్వాత పెళ్లికి వెళ్లారు. అందుకే ఆయనకు వరదబాధితుల గోడు వినడానికి మధ్యలో టైం ఎక్కువ దొరకలేదు.
ఉదయం ఒక చావు- సాయంత్రం ఒక పెళ్లి.. మధ్యలో ఒక ‘బిజినెస్ పర్సన్ తో భేటీ’.. ఈ ఒత్తిడి మధ్య ఒక ప్రజల కోసం ఆమన ఏమాత్రం సమయం వెచ్చించగలరు? ఎవరికైనా అయ్యోపాపం అనిపిస్తుంది.
వీటిలో అదానీ డీల్ కీలకం. సాధారణంగా బడా పారిశ్రామికవేత్తలు సీఎంను కలిస్తే.. రాష్ట్రానికి పెట్టుబడుల పరంగా.. మంచి వాతావరణం ఏర్పడుతున్నట్లుగా ప్రచారం చేసుకోవడానికి వెంటనే మీడియా రిలీజ్ లు విడుదల చేస్తారు. కానీ అదానీతో జగన్ భేటీ గురించి ఎలాంటి ప్రకటన లేదు. వారి మధ్య గంటల తరబడి నడిచిన చర్చల సారాంశం ఏమిటి? కుదిరిన డీల్ ఏమిటి? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది.
మరి ఆదివారం వరదబాధిత ప్రాంతాలకు వెళ్లొచ్చు కదా అనుకోవచ్చు. ఆదివారం జగన్ కు చర్చి డే. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయన ఆదివారం ఎలాంటి ఇతర కార్యక్రమాలు పెట్టుకోరు. ఎవ్వరికీ అందుబాటులోనూ ఉండరు. సోమవారం దాకా వరద పర్యటన సాగదీస్తే.. అప్పటికే మామూలు అవుతున్న వాతావరణం వల్ల సోమవారానికి ఇక ఆయన పరిశీలించడానికి వరద తీవ్రత కూడా కనిపించకపోవచ్చు. అందుకే శనివారం హడావుడిగా వెళ్లి.. కనీసం ఒక్క బాధితుడినైనా పలకరించకుండా తిరిగొచ్చారు. రెండు జిల్లాలు సర్వనాశనం అయితే.. కనీసం రెండు గంటల సమయం కూడా ఆకాశంలోంచి చూడడానికి కూడా కేటాయించలేకపోయారు.
పార్టీ ఎమ్మెల్సీ కరీమున్నీసా మరణానికి సంతాపం, సానుభూతి తెలియజెప్పడం ముఖ్యమంత్రికి అవసరమే. కానీ పదుల సంఖ్యలో తన సొంత జిల్లా ప్రజలు వరదల్లో చచ్చిపోతే.. ఇంకా ఎందరు చచ్చిపోయారో ఖచ్చితంగా లెక్కే తేలకుండా ఉంటే.. వారిని కూడా నేరుగా పరామర్శించి ధైర్యం చెప్పడం తన బాధ్యత అని ముఖ్యమంత్రి అనుకోకపోవడమే తమాషా.











