మెగాస్టార్ చిరంజీవి దృష్టి అంతా ఇప్పుడు సినిమాల మీదే ఉంది. వరుస సినిమాలతో దూకుడు పెంచేశారు. ఇదిలా ఉంటే మాస్ హీరో చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి ఓ సినిమాలో కనిపించబోతున్నారట. వీరిద్దరూ ఇంతకుముందు ‘అన్నయ్య’ సినిమాలో నటించారు. ఆ తర్వాత కలిసి నటించే అవకాశం రాలేదు. రవితేజ అప్పుడు స్టార్ కాదు. కానీ ఇప్పుడు స్టార్ గా ఎదిగాక నటించడం విశేషం. మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కాబోతోంది. గాడ్ ఫాదర్, భోళాశంకర్ చిత్రాలు షూటింగులో ఉన్నాయి.
వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ చిరు నటిస్తున్నారు. అలాగే బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా కూడా లైన్ లో ఉంది. వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. ఇందులో చిరు ఓ కాప్ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. విషయమేమిటంటే హీరో రవితేజ కూడా ఇందులో ఓ ప్రత్యేక పాత్ర పోషించనుండటం. అది కూడా అన్నయ్యలో మాదిరిగానే చిరు తమ్ముడి పాత్ర అట. దాదాపు 22 ఏళ్ల తర్వాత చిరుతో కలిసి రవితేజ నటిస్తున్నారు. చిరు పాత్రకు ఏ మాత్రం తగ్గకుండా రవితేజ పాత్ర కూడా ఉంటుందని సమాచారం.
దాదాపు సినిమాలో 40 నిమిషాల పాటు ఈ పాత్ర ఉంటుందట. బాబి దర్శకత్వంలో రవితేజ పవర్ అనే సినిమా చేశారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అందుకే బాబి అడగ్గానే రవితేజ ఓకే చెప్పేశారట. మెగాస్టార్ చిరంజీవి వరసగా ఇన్ని సినిమాలు ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమాల పరంగా ఓ కొత్త రికార్డును ఆయన సృష్టించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఏడాదికి మూడు సినిమాలకు తగ్గకుండా ఆయన చూసుకుంటున్నారు.











