బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆహా ఓటీటీలోని అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో అల్లు అరవింద్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సీజన్లో మొదటి గెస్ట్ గా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తీసుకురావడంతో ఈ ఎపిసోడ్ పై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. హోస్ట్ గెస్ట్ ల మధ్య వ్యక్తిగత విషయాలే కాకుండా రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు రావడంతో జనం భారీ స్థాయిలో వీక్షించినట్టు తెలుస్తోంది. 14వ తేదీ మొదటి ఎపిసోడ్ ప్రసారమైన 24 గంటల్లోనే ఏకంగా పది లక్షలకు పైగా వ్యూస్ సాధించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ విధంగా ఒక టాక్ షో కేవలం 24 గంటల్లోనే ఈ స్థాయిలో వ్యూస్ సాధించడం రికార్డు అంటూ నిర్వాహకులు పేర్కొన్నారు.
బాలయ్య మనసు కూడా అన్ స్టాపబుల్ అనేది ఈ సందర్భంగా రుజువైంది. అయినా అరవింద్ సైతం తగ్గేదేలే అంటున్నారు. ఏ విషయంలోనో చూద్దాం. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో మొదలైన అచ్చ తెలుగు ఓటీటీకి వచ్చిన ఆదరణను అన్స్టాపబుల్ షోకు ముందు, తర్వాత అనొచ్చు. కేవలం ఈ షో కోసమే ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లు లక్షల లక్షల సంఖ్యలోనే ఉన్నారు. సీజన్ 2 విషయంలోనూ అది పునరావృతమైంది. సాధారణంగా వేదిక మీద బాలయ్య మాట్లాడితే తడబడతారు. అదేంటో ఈ వేదిక మీదికి రాగానే బాలయ్యలో హోస్ట్ పూనుతున్నాడు. బాలయ్య మాట్లాడే విధానం చూసి ప్రేక్షకులు ముక్కున వేలేసుకున్నారు. మంచి వాక్చాతుర్యం, చలోక్తులు, బాడీ లాంగ్వేజ్ తో బాలయ్య ఈ షోను నిర్వహిచే తీరు ఎందరికో ముచ్చటేస్తోంది.
14వ తేదీ షో ప్రారంభమవుతుందనగానే సబ్ స్క్రయిబర్లు విపరీతంగా పెరిగి ఆహాకు బోలెడంత డబ్బు సమకూరిందట. దాంతో అరవింద్ సైతం అబ్బురపడిపోయి ముందు మాట్లాడుకున్న దానికన్నా ఎక్కువ పారితోషికం ఇవ్వాలనుకున్నారట. బాలయ్య దగ్గర ఈ మాట అనగానే పెంచేదేలే అనేశారట బాలయ్య. ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా… బాలయ్యది ఎంత దొడ్డ మనసో అర్థమవుతోంది కదూ. తనకు ఎక్కువ పారితోషకం వద్దని, అది తన విలువలకు విరుద్ధమని అన్నారట బాలయ్య. దాంతో అరవింద్ కు ఏమీ పాలుపోలేదు. తను వెనక్కు తగ్గేదే లే అనుకున్నారట.
బాలయ్య పెద్ద మనసు అల్లు అరవింద్ కట్టిపడేయడంతో బాలయ్య తిరస్కరించిన మొత్తాన్ని ఎలాగైనా అందజేయాలని నిర్ణయించుకున్నారట. తను ఎంతయితే రెమ్యునరేషన్ పెంచాలనుకున్నారో ఆ మొత్తాన్ని బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ఇవ్వాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఎంతైనా అల్లు అరవింద్ ది మాస్టర్ బ్రెయిన్ కదా. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ ఇద్దరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుని జనం మనసులు గెలవబోతున్నారు. డబ్బులు ఇస్తానంటే వద్దనే వ్యక్తులు ఈరోజుల్లో ఎవరుంటారు.. బాలయ్య మాటంటే మాటే. ఆహా ఏమి నిర్ణయాలు లే.











