పురుష ప్రభుత్వ ఉద్యోగులూ చిన్నారుల పాలన సెలవు (చైల్డ్ కేర్ లీవ్) తీసుకోవచ్చని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. అయితే కేవలం బిడ్డ పాలన తండ్రి మాత్రమే చూసుకుంటూంటేనే ఈ సెలవు మంజూరు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒక వేళ భార్య చనిపోయిన, విడాకులు ఇచ్చిన తండ్రులు తమ బిడ్డల బాధ్యతలను చూసుకోవడానికి ఈ సెలవును ఉపయోగించుకోవచ్చని చెప్పారు.
దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినా తగినంత ప్రచారం రాకపోవడంతో ఈ చట్టం గురించి పెద్దగా అవగాహన లేదని తెలిపారు. చిన్నారుల పాలన కోసం సెలవు తీసుకునే ఉద్యోగులు సంబంధిత అధికారి ముందస్తు అనుమతితో తాను పని చేస్తున్న కేంద్రాన్ని విడిచిపెట్టి పోవచ్చన్నారు. ఈ సెలవులో ఉన్నప్పటికీ ఎల్ టీ సీ ఉపయోగించుకోవచ్చని చెప్పారు. చిన్నారుల పాలనా సెలవులు తీసుకున్న వారికి తొలి 365 రోజుల్లో 100 శాతం జీతం వస్తుందని , తదుపరి 365 రోజుల్లో 80 శాతం జీతం వస్తుందని పేర్కొన్నారు. పిల్లల 22 ఏళ్ల వరకే చిన్నారుల పాలనా సెలవును తీసుకోవాలన్న నిబంధనను దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులకు రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ అవకాశం కేవలం పురుషులకు మాత్రమే వర్తిస్తుందని ఆదేశాలు జారీ అవ్వడంతో మహిళ సంఘాలు కొన్ని వ్యతిరేకత తెలుపుతున్నాయి. కేవలం మగవారికి మాత్రమే సెలవు ఎలా ఇస్తారు. మరి పిల్లల బాధ్యత పూర్తిగా చూసుకునే మహిళలకు ఎందుకు ఇలాంటి సెలవు వెసులుబాటు కల్పించరు అంటూ నిలదీస్తున్నారు.
ప్రతి విషయంలోనూ మహిళల పట్ల వివక్షత చూపుతున్నారంటూ ఆందోళన చేస్తున్నారు. ఇంటి పని, పిల్లల పని పూర్తిగా ఆడవారిదే అన్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం సరికాదు అంటున్నారు. మరి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే మహిళలకు ఎందుకు ఇలాంటి సౌకర్యాన్ని కలిగించలేదని వారు ప్రశ్నిస్తున్నారు.











