జెసి ప్రభాకర రెడ్డికి కోర్టు బెయిలు ఇచ్చిన వెంటనే.. కరోనా కేసు కింద పోలీసులు మళ్లీ అరెస్టు చేయడం.. జైల్లో రిమాండులో ఉన్న ఆయనకు కరోనా సోకడం అనేది తెలుగుదేశం నాయకులకు ఆగ్రహం తెప్పిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిప్పులు చెరిగారు.
జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదు రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసం మాత్రమే అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు. ఒక పక్క కరోనా, మరో పక్క వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని గాలికొదిలి ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులకు ప్రణాళిక సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారంటూ ఆరోపణలు గుప్పించారు. కేవలం వ్యక్తిగత కక్ష సాధింపుతోనే జేసీ కుటుంబం పై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని వ్యాఖ్యానించారు.
అనేక రకాల కేసుల్లో ఇరికిస్తున్న ప్రభుత్వం, ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నాయకుల పై కరోనా కేసులు పెట్టే నీచ స్థాయికి దిగజారిపోయారంటే ఆయన మానసిక స్థితి ఏంటో అర్థం అవుతుందని లోకేష్ పేర్కొన్నారు. బెయిల్ పై రిలీజ్ అయిన 24 గంటల్లోనే జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా కేసు కింద మళ్ళీ అరెస్ట్ కావడం ఒక ఎత్తయితే… ఆయన కడప జైలులో కరోనా బారిన పడటం మరింత బాధాకరం అని లోకేష్ విమర్శించారు.
జేసి ప్రభాకర్ రెడ్డి కి కరోనా సోకడానికి జగన్ రెడ్డి నేర మనస్తత్వమే కారణమని, కడప జైలు లో 317 మందికి కరోనా ఉన్నట్టు నిర్దారణ అయ్యిందని పేర్కొన్నారు. తక్షణమే ఆసుపత్రికి తరలించి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
కోర్టుకు వెళ్లనున్న తెలుగుదేశం
జెసి ప్రభాకర రెడ్డికి జైల్లో కరోనా సోకిన నేపథ్యంలో ఆయనకు మెరుగైన చికిత్స అందేలా చూడడానికి హైకోర్టును ఆశ్రయించే ఉద్దేశంతో తెలుగుదేశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జేసీ ప్రభాకర రెడ్డి కడప జైల్లో ఉన్నారు. ఆ జైల్లో 317 మందికి కరోనా సోకగా.. కేవలం ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ ను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తే తప్ప న్యాయం జరగదని తెలుగుదేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఇలాంటి వినతుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే అభిప్రాయం వారికి లేదు. అందుకే హైకోర్టును ఆశ్రయించాలని అనుకుంటున్నట్లు సమాచారం.
అచ్చెన్నాయుడుకు కూడా జైల్లోనే కరోనా సోకింది. ఆయనకు గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స అందించారు. అయితే అక్కడ కూడా చికిత్స సరిగా లేదనే భయంతో కోర్టును ఆశ్రయించారు. ఆయనను ఎన్నారై ఆస్పత్రికి తరలించి.. విడిగా ఒక గదిలో ఉంచి చికిత్స చేయించాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మాత్రమే.. అది సాధ్యమైంది. ఆ వ్యవహారం దృష్టిలో ఉంచుకుని జేసీ ప్రభాకర్ కోసం కూడా కోర్టును ఆశ్రయించాలనే ఆలోచనతో తెలుగుదేశం ఉందని తెలుస్తోంది.











