తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని లంక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. లక్షా 23 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అయినా వైసీపీ నాయకులు కనీసం రైతులను పరామర్శించిన దాఖలాలు లేవు. సీఎం జగన్ హెలిటూర్ పెట్టుకున్నారు. గ్రామాల్లో తిరిగిన కొందరు నాయకుల పరామర్శలు ఎలా సాగాయో కూడా ప్రజలు చూశారు.
కానీ కరకట్ట వెంట ఉన్న చంద్రబాబునాయుడు నివాసం మునుగుతుందని వెంటనే ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులతో నోటీసులు ఇప్పించారు. వరుసగా మూడోసారి నోటీసులు జారీ చేసినా నేటికీ చంద్రబాబు ఇంట్లోకి వరదరాకపోవడంతో వైకాపా నాయకులు నిరుత్సాహానికి గురయ్యారని అనిపిస్తోంది.
మునుగుతుందా? లేదా?
బెట్టింగ్ రాయుళ్లకు కొత్త సబ్జెక్ట్ దొరికింది. కరకట్ట ప్రక్కన ఉన్న చంద్రబాబు నివాసం ఈసారి గ్యారంటీగా మునుగుతుందని కొందరు, ఈ సారి కూడా చంద్రబాబు ఇంట్లోకి నీరు రాదని మరికొందరు ఇలా బెట్టింగులకు దిగుతున్నారు. సహజంగానే ఈ బెట్టింగ్, అధికార- విపక్ష పార్టీలకు చెందిన వారి మధ్యనే సాగుతోంది. చంద్రబాబు ఇల్లు మునుగడం గ్యారంటీ అని, వైసీపీ వాళ్లు పందేలు కాస్తోంటే.. ఇటు తెలుగుదేశం నాయకులు మాత్రం.. అసాధ్యం అని పందెం పెడుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. దీనికి అదనంగా తెలంగాణ నుంచి మరికొంత వరద నీరు కృష్ణా నదికి చేరుతోంది. ఇలా మొత్తం 2009 వరదల తరవాత అత్యధిక వరద చేరుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలపై బెట్టింగ్ రాయుళ్లు పందేలకు దిగుతున్నారు.
పులిచింతల పుల్ టాంక్ అందుకేనా?
పులిచింతలలో 45 టీఎంసీల నీటి నిల్వ చేశారు. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడంతో ప్రాజెక్టుకు వచ్చిన వరద వచ్చినట్టే ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు. ఎలాగూ ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద వస్తోందని రాష్ట్ర అధికారులను కేంద్ర జలసంఘం హెచ్చరించింది. ఇలాంటి సమయంలో పులిచింతలలో నీటి నిల్వను తగ్గించుకోవాలి. కొంత ప్రాజెక్టు ఖాళీగా పెట్టుకోవడం ద్వారా ఎగువ నుంచి వచ్చే వరదను నియంత్రించడానికి వీలవుతుందని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతున్నారు. కానీ ఏపీ అధికారులు అలా చేయడం లేదు. పులిచింతల ప్రాజెక్టులో పూర్తిగా నీరు ఉంచి, ఎగువ నుంచి వచ్చే వరదకు అధనంగా పులిచింతల నీరు కూడా కిందకు వదలి కరకట్ట వెంట ఉన్న చంద్రబాబు నివాసంతోపాటు, అమరావతి రాజధానికి కూడా ముంచాలనే కుట్ర సాగుతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇందులో నిజా నిజాలు ఎంత అనేది తేలాల్సి ఉంది.
ప్రస్తుత వరదలకు చంద్రబాబు నివాసం మునగదు
ప్రస్తుతం వచ్చే వరదకు కరకట్ట వెంట ఉన్న చంద్రబాబునాయుడు నివాసం మునిగే అవకాశం లేదని జలవనరుల శాఖలో పనిచేసి పదవీవిరమణ చేసిన కొందరు ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. 9 లక్షల క్యూసెక్కులు పులిచింతల నుంచి వరద కిందకు వదలినా ఆ ప్రభావం చంద్రబాబు నివాసంపై చూపలేదు. అంటే ప్రస్తుత వరదకు చంద్రబాబు నివాసంలోకి కానీ, అమరావతి రాజధాని గ్రామాల్లోకి గానీ వరద నీరు వచ్చే అవకాశం లేనట్టేనని చెప్పవచ్చు. కుట్రతో పులిచింతల నుంచి ఒకేసారి పెద్ద ఎత్తున వరద నీటిని వదలి ముంచితే తప్ప చంద్రబాబునివాసంలోకి చుక్కనీరు వచ్చే అవకాశం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.











