ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ పుట్టిస్తుంటాయి. నాయకుల మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన రాజకీయ నాయకులను ఈ జిల్లా నుండి పంపారు ప్రజలు. నాగం జనార్ధన్ రెడ్డి, డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి , ప్రస్తుతం నిరంజన్ రెడ్డి ఇలా అనేక మంది బలమైన రాజకీయ నాయకులు ఈ జిల్లా నుండి రాష్ట్ర రాజీకీయాలను ప్రభావితం చేస్తున్నారు. తలో పార్టీలో ఉంటూ తమ పార్టీని కాపాడుకునేందుకు తమ వంతు పాత్ర పోషించే వారు. ఇక రాజకీయంగా తనకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడేవారు కూడా. తాను ఉండగా పార్టీలో మరో వ్యక్తి తన స్థాయికి రావద్దనుకుంటూ, పోటీగా ఎదుగుతున్న వారిని ఎక్కడిక్కడ అణిచి వేయడంలో కూడా రాజకీయ నాయకులు ఉద్దండులు. ఇక కొల్లాపూర్ రాజకీయాలు ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా ఉన్నాయి.
కొల్లాపూర్ కోటలో జూపల్లి పాగా..
కొల్లపూర్ కోటలో జూపల్లి కృష్ణారావు తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వెలమ సామాజిక వర్గం నుండి వచ్చిన ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెక్ పెడుతూ రాజకీయాల్లో ఎదిగారు. ఏ చిన్న అవకాశం దొరికినా తన ప్రత్యేకతను చాటుకునే వారు. ఆయన రాజకీయ చతురతకు మెచ్చి అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. దీంతో ఆయన రాజకీయ ప్రభావం జిల్లా అంతా చాటుకున్నారు. అప్పటి వరకు ఎవరికి తెలియని జూపల్లి మంత్రి అయిన తరువాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అప్పటికి జిల్లాలో బలంగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డికి కౌంటర్‌గా జూపల్లికి మంత్రి పదవి ఇచ్చారన్న వార్తలు గుప్పుమన్నాయి. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పార్టీ మారిన ఆయన వెలమ ఈక్వేషన్‌లో కేసీఆర్‌కు మరింత దగ్గరయ్యారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ క్యాబినేట్‌లో కూడా ఆయనకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు .
ప్రస్తుత ఎమ్మెల్యే హర్షవర్దన్‌కు కొరకరాని కొయ్యగా..
జూపల్లి కృష్ణారావును 2018ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసిన హర్షవర్దన్ రెడ్డి గెలుపొందారు. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో జూపల్లిని పక్కన పెట్టేసారని భావించారు అంతా. అయితే, ఆయన బయటకు కనిపించని రాజకీయం కొల్లపూర్‌లో బాగానే చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సామాజికవర్గం అండతో ఎమ్మెల్యేకు చెక్ పెడుతున్నారని టాక్. ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళినా జూపల్లి కేడర్ పెద్దగా ఆయనకు సహకరించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన జూపల్లిపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పంచాయితీ అదిష్టానం వద్దకు వెళ్ళినా పెద్దగా ప్రయోజనం లేనట్టు తెలుస్తోంది. పదవిలో లేక పోయినా వచ్చే ఎన్నికలకు బలమైన బేస్ వేసుకునే క్రమంలో హర్షవర్దన్ రెడ్డిని అడుగడుగునా ఇరుకున పెడుతున్నట్టు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కలుగ జేసుకుని ఈ వివాదాన్ని పరిష్కరించకపోతే ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి తన నిర్ణయం తాను తీసుకునేలా కనిపిస్తోంది.
AlsoRead ;- జేజమ్మ ప్రయత్నాలు ఫలించేనా.. వారసురాలొచ్చేనా











