కరోనా కష్టకాలంలో వలస కార్మికుల్ని ఆపద్బాంధవుడిలా ఆదుకొని రియల్ హీరో అని పించుకున్నాడు సోనూసూద్. దేశ వ్యాప్తంగా సినీ సెలబ్రీటీస్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కానీ, సోనూ స్థాయిలో పరిథులు విధించుకోకుండా.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. డబ్బు ఖర్చుపెట్టి.. తనకంటూ ఒక వ్యవస్థను ఏర్పరుచుకొన్న వారు లేరనే చెప్పాలి. ఏకంగా 20 వేలమందికి పైగా వలస కార్మికుల్ని వారి వారి స్వస్థలాలకు పంపి.. కష్టంలో ఉన్న మరెంతో మందికి దానధర్మాలు చేసి.. అపర కర్ణుడు అనిపించుకున్నాడు సోనూ. ఇప్పటివరకూ చేసిన దానికి అతడికి ఎన్నో కోట్లు ఖర్చయి ఉంటుంది. బాలీవుడ్ లో మీడియమ్ రేంజ్ నటుడైన సోనూ సూద్ కు అంతటి స్థాయిలో ఖర్చుపెట్టే స్థోమత ఎక్కడిది? అని చాలా మందిలో సందేహాలు తలెత్తుతున్నాయి.
తాజాగా ఇదే విషయం గురించి అతడ్ని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. దానికి సమాధానం చెప్పాడు సోనూ భాయ్. జనం అనుకునే స్థాయికన్నా ఎక్కువగానే తన ఆర్దిక పరిస్థితి ఉందని, ఈ సేవా కార్యక్రమాల్లో తనొక్కడి భాగస్వామ్యం మాత్రమే లేదని, ఎంతో మంది సాయం చేస్తున్నారని వెల్లడించాడు. ముందు నుంచి తన కుటుంబానికి లే లోటూ లేదని. చాలా వ్యాపారాలున్నాయని, తాను మోడలింగ్‌తో పాటు సినిమాలు చేసి బాగానే సంపాదించానని, వాటితో ముందుగా ఈ కార్యక్రమాలు మొదలుపెట్టానని, తర్వాత మంచి మనసున్న చాలా మంది చేతులు కలిపారని తెలిపాడు . తాను ఈ స్థితిలో ఉన్నానంటే ఎంతో మంది సాయం వల్లే అని నమ్ముతానని చెప్పాడు. ప్రస్తుతం తలపెట్టిన సేవా కార్యక్రమాలకు ఎంతోమంది ఆర్థికంగా, సాంకేతికంగా సాయం చేస్తున్నారని . వాళ్లందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు’’ అని సోనూ సూద్ తెలిపాడు. ఇక తనకి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఎంతమాత్రం లేదని, కొన్ని పార్టీల నాయకులు అడుగుతున్నారని, కానీ తనకే ఆసక్తి లేదని చెప్పాడు. అతడి నిస్వార్ధ సేవకి ఇప్పటికే ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. ఈ స్థితిలో అతడు రాజకీయాల్లోకి వస్తే జనం తప్పకుండా స్వాగతిస్తారని చర్చించుకుంటున్నారు సినీజనం.











