రేపటి నుంచి జరిగే శాసనసభ శీతాకాల సమావేశాలకు మీడియాను అనుమంతించడంతో పాటు మీడియా పాయింట్ పునరుద్ధరించాలని ఏపీ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శాసనసభ స్పీకర్‌కు లేఖ రాశారు. ప్రజాస్వామ్యంలో ప్రధాన భాగస్వామి అయిన మీడియాను నిషేధించడం అప్రజాస్వామ్యమని, ప్రజా సమస్యలపై ప్రజావాణి వినిపించి, చట్టసభల నిర్వహణ తీరును, చర్చలను ప్రజలకు యథాతథంగా చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2430 ద్వారా మీడియా హక్కులను హరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే శిక్షించాలని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ జీవోను రాష్ట్రంలోనే కాకుండా జాతీయ మీడియా కూడా తీవ్రంగా వ్యతిరేకించిందని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ జీవోను తప్పుబట్టిందన్నారు. ఇప్పుడు చట్టసభల్లోకి మీడియాను నిషేధించడం అంతకంటే దారుణమైన చర్యని అన్నారు. అధికారపక్షం, ప్రతిపక్షం వ్యవహారశైలిని నిస్పక్షపాతంగా ప్రజలకు చేరవేసే అవకాశం ఒక్క మీడియాకు మాత్రమే ఉందన్నారు. అటువంటి మీడియాను నిషేధించడం, పత్రికా హక్కులను కాల రాయటం, ప్రజాస్వామిక విలువలను అణగదొక్కటంగా తాము భావిస్తున్నామని తెలిపారు. పార్లమెంటు సమావేశాలకు మీడియాను అనుమతిస్తుండగా ఇక్కడ ఎందుకు విధిస్తున్నారన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
దేశంలో ప్రథమంగా..
1998లో తెలుగుదేశం పార్టీ దేశంలో ప్రథమంగా చట్ట సభల్లోని కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేనప్పటికీ చట్టసభల్లో జరిగిన చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేసి ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిని ప్రజలకు చెప్పిన ఘనత టీడీపీదే అన్నారు. తర్వాత పార్లమెంటు కూడా చట్టసభల్లోని కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించిందన్నారు. తర్వాత చాలా రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయన్నారు.
చట్టసభల్లోని కార్యక్రమాలు ప్రజలకు యథాతథంగా తెలియజేసే అవకాశం ఉన్న మీడియాను నిషేధించడంపై టీడీపీ తీవ్రంగా నిరసిస్తున్నట్లు తెలిపారు. చట్టసభల్లో ప్రత్యక్ష ప్రసారాలకు అన్ని మీడియా సంస్థలకు అవకాశం ఇవ్వాలని, చట్టసభల సమావేశాలు జరుగుతున్నన్ని రోజులూ మీడియా పాయింట్‌ను అనుమతించాలని టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యానికి అర్థం సభలో మెజారిటీ అయినప్పటికి, సభా కార్యక్రమాలను యథాతథంగా ప్రజలకు తెలియజేసే అవకాశం ఇవ్వడమే నిజమైన పరమార్థం అని పేర్కొన్నారు.











