జీహెచ్ఎంసీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండడంతో చివరి క్షణం వరకూ సమయాన్ని ఆయా పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారానికి బీజేపీ ఈ సారి సీఎం, మాజీ సీఎంలను, కేంద్ర మంత్రులను ఏకంగా దింపేసింది. టీఆర్ఎస్ కూడా బీజేపీకి ధీటుగానే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. నియోజక వర్గాల వారీగా మంత్రులు బాధ్యతలను తీసుకుని మరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై షాకింగ్ కామెంట్లు చేసింది.
అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్.. ఇప్పుడు బండి సంజయ్ కామెడీ షో చేస్తున్నారని కవిత ఎద్దేవా చేశారు. హైదరాబాద్ పేరు మారిస్తే ఏమొస్తుంది? అని ఆమె ప్రశ్నించారు. పేరు మార్చడం కాదని, పరిపాలన విధానం మార్చుకోవాలని కవిత సూచించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టడం గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే కవిత చేసిన కామెంట్లపై సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. తాను కామెడీ మ్యాన్ కాదని, రాజకీయాల్లో తనని లాగొద్దని కోరారు.










