తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దుబ్బాకలో బీజేపీ గెలిచాక, తిరుపతి ఉప ఎన్నికపై రాజకీయ విశ్లేషణలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీకి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఎవరైనా సిట్టింగ్ అభ్యర్థులు చనిపోతే టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీ పెట్టకూడదని గతంలో ఓ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఆ నిర్ణయం ప్రకారం నడవాలా? లేదంటే తిరుపతిలో పోటీ చేసి సత్తా చాటుకోవాలో టీడీపీ అధినేత ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. టీడీపీ నుంచి అభ్యర్థిని పోటీ పెడితే తిరుపతిలో త్రిముఖపోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఇది వైసీపీకి విజయానికి బాటలు వేస్తుందనే అంచనా, టీడీపీ అధినేతకు నిద్రలేకుండా చేస్తోందట. అధికార వైసీపీ ఒకవైపు, మరోవైపు బీజేపీ, జనసేనతో టీడీపీ తలపడాల్సి ఉంటుంది. బీజేపీ నేతలు అసలే దుబ్బాక విజయంతో మంచి దూకుడు మీదున్నారు. తిరుపతిలో బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుని, వార్డు మెంబరుగా కూడా గెలవలేకపోతున్న పార్టీ అని, ఆంధ్రప్రదేశ్‌లో విపరీతమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న పార్టీ అని వ్యాఖ్యానించే విమర్శకుల నోర్లు మూయించాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.
బీజేపీకి స్నేహహస్తం ఇస్తే ప్రమాదమా?
అధికార బలం ఉన్న వైసీపీని తిరుపతిలో ఓడించడం అంత తేలికకాదు. రంగంలోకి దిగాక ఎంత ఖర్చు వస్తుందో తలచుకుంటేనే టీడీపీ నేతలకు నిద్రపట్టడం లేదని తెలుస్తోంది. అలాగని పోటీ నుంచి తప్పుకుని బీజేపీ, జనసేన కూటమికి అవకాశం ఇస్తే, పొరపాటున వారు గెలిస్తే, ఇక వారి హడావుడి తట్టుకోవడం కష్టమనే అంశంపైనా టీడీపీ అధినేత తీవ్రంగా చర్చలు జరిపారని తెలుస్తోంది. వారం రోజులపాటు ఉండవల్లి నివాసంలో మకాం వేసిన టీడీపీ అధినేత పార్టీ ముఖ్యులతో తిరుపతిలో పోటీ చేయాలా? లేదా? అనే అంశంపై తీవ్రంగా చర్చలు జరిపారని సమాచారం. టీడీపీ సీనియర్ దళిత నేత వర్ల రామయ్యను కూడా పిలిపించుకుని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిరుపతి అంశంపై చర్చించినట్టు సమాచారం.
AlsoRead ;- జనసేనను నమ్ముకుని.. బరిలో తొడకొడుతున్న బీజేపీ!
వర్ల రామయ్యను తిరుపతి బరిలో దింపుతారా?
తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే టీడీపీ నుంచి వర్ల రామయ్యను రంగంలోకి దింపాలని కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే వర్ల రామయ్యను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని చర్చించారట. అయితే వర్ల రామయ్య తిరుపతికి నాన్ లోకల్ కావడం కొంత మైనస్ అని భావిస్తున్నారు. అసలు తిరుపతిలో పోటీ చేయాలా? ఒక వేళ పోటీకి దిగితే ఎవరిని రంగంలోకి దింపాలనే దానిపై టీడీపీ అధినేత ఇప్పటి నుంచే తీవ్రంగా రాజకీయ మథనం చేస్తున్నారని తెలుస్తోంది.
చాలా కీలకం…
వైసీపీ ఒకటిన్నర సంవత్సరాల పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనికితోడు తిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయ పాలక మండలి తీసుకున్న అనేక నిర్ణయాలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఒకసారి తిరుపతిలో వైసీపీని ఓడించాలని స్థానికులు కసిగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. అందుకే తిరుపతిలో పోటీకి బీజేపీ, జనసేన కూటమి పోటీకి కాలు దువ్వుతోంది. ఇక్కడ ఏ పార్టీ గెలిచినా, ఆ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై తీవ్రంగా ఉంటుంది. వైసీపీ ఓడిపోతే ఆ ప్రభుత్వంపై ప్రజలు కసిగా ఉన్నారని అర్థం. ఇక టీడీపీ గెలిస్తే, ఆ పార్టీ పుంజుకుందని అర్థం చేసుకోవచ్చు. ఇక బీజేపీ ఖాతా తెరిస్తే ఇక ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని వారు ప్రచారం చేసుకోవచ్చు. ఇన్ని రాజకీయ పరిణామాలకు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వేదిక కానుంది.
స్థానిక ఎన్నికలపై కూడా ప్రభావం
తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే వస్తే వైసీపీకి ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు. తిరుపతిలో వైసీపీ గెలవడం కూడా అంత తేలిక కాదు. తిరుమలలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై 23 దాడులు జరిగినా వైసీపీ ప్రభుత్వం అన్యమతాలకు కొమ్ముకాస్తోందని తిరుపతి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని నిఘా సంస్థల సమాచారం కూడా చెబుతోంది. అదే జరిగితే తిరుపతిలో వైసీపీ అభ్యర్థి ఓడిపోయే ప్రమాదం ఉంది. దీని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్రంగా పడే ప్రమాదం ఉంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే తిరుపతి ఉప ఎన్నిక జరిగితే, అక్కడ తప్పక గెలిచి తీరాల్సిన ఆవశ్యకత వైసీపీకి ఏర్పడుతుంది. అందుకే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయ విశ్లేషకుల అంచనా.
AlsoRead ;- తిరుపతి ఎంపీ సీటు ఆ మాజీ మంత్రికి కావాలట !