“జాతీయ పార్టీయా. గదేంది. ఎప్పుడంటే గప్పుడు పెట్టుడేనా… ఓ పద్దతీ.. పాడూ లేదా. కూసో… ఆడెవడో రాసుడు… ఈనగారు లేసి అడుగుడు. తమాషగుందా. పార్టీలంటే “ ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటలు. ఎక్కడనుకుంటున్నారా… ఎప్పుడనుకుంటున్నారా… ఇంకెక్కడా… ఇంకెప్పుడు. సోమవారం నాడు. తెలంగాణ శాసనసభ పక్షం సమావేశంలో కల్వకుంట్ల వారు ఈ మాటలు అన్నారు.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రెచ్చిపోతోందని, దానికి అడ్డుకట్టవేసేందుకు జాతీయ స్ధాయిలో కే.చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో ఓ జాతీయ పార్టీ రాబోతుందని సోమవారం నాడు మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది. ఈ పార్టీ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చించారని, వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటూ ఆ వార్త కథనంలో పేర్కొన్నారు. అంతే కాదు… ఈ విషయమై సోమవారం సాయంత్రం జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్షం సమావేశంలో చర్చిస్తారని కూడా రాశారు.
ఈ విషయమై సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఓ ఎమ్మెల్యే ప్రస్తావించగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పై విధంగా స్పందించినట్లు సమాచారం. “గిప్పుడు పార్టీలేంది భాయ్. గిప్పట్లే ఎన్నికలు లేవు. ఇది మరో మూడేళ్ల తర్వాత ముచ్చట. అప్పుడు సూద్దాం తీయ్. గీ పత్రికలోళ్లు చాలా కెలుకుతారు. మనం గమ్మునుండాలె. అయినా అందరికీ సెప్పి చేస్తామా రాజకీయాలు “ అని సమాధానం చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల వైపు మొగ్గు చూపితే మాత్రం జాతీయ పార్టీ ఆలోచన చేద్దామని, ప్రస్తుతానికి అంతా బాగున్న సమయంలో పాడు చేసుకుంటామా అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యానించినట్లు సమాచారం.
శాసనసభలో జాగురుకతతో ఉండాలే…
ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశించారు. వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన కీలక సమయమని, ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు శాసనసభలో విరుచుకుపడే అవకాశం ఉందని, వారి దాడుల నుంచి సమర్ధవంతంగా జవాబులు ఇవ్వాలని సీఎం సూచించినట్లు చెబుతున్నారు. “మీరు జాగ్రత్తగా మాట్లాడడండి. ఈ అంశం గురించి పూర్తిగా తెలిసిన వారు మాత్రమే స్పందించండి. తెలియని వారు కలుగజేసుకుని ఇబ్బందుల్లో పడొద్దు “ అని ఎమ్మెల్యేలకు హితబోధ చేసినట్లు తెలిసింది.
అలాగే, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ అడ్డుకోవద్దని, వారిని మాట్లాడించి వాటికి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు.
ఈ నెల 28 వరకూ శాసనసభ…
సోమవారం ప్రారంభమైన శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 28 వరకూ నిర్వహించాలని నిర్ణయించారు. మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ దివంగత పీ.వీ.నర్శింహారావుకు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని ఈ సమావేశాల్లోనే చేపట్టి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. “దీనికి ఎప్పటి వరకూ ఆగడం ఎందుకు. మంగళవారమే తీర్మానం చేసేద్దాం “ అని సీఎం అన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీతో మజ్లీస్ కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ సమావేశాల్లో కరోనా వ్యాప్తి, కట్టడి, శ్రీశైలం ప్రాజెక్టులో జరిగిన ప్రమాదం, సంక్షేమం, వ్యవసాయం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చిద్దామని సీఎం అన్నట్లు చెబుతున్నారు.










