‘అధికారులందరినీ ఇకపై జరిగే సమీక్షలకు పిలవండి .. వాళ్లంతా వస్తే తలుపులు వేద్దాం. తాను అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కానీ పరిస్థితులు అలా మారుతున్నాయి. ఎడ్ల బండ్లపై ఇసుక తీసుకెళ్లే వారిపైనా అధికారులు కేసులు పెట్టడమేంటి..? ప్రభుత్వ పనులకు ఇసుక తీసుకెళ్తుంటే అధికారులు అడ్డుకోవడం ఏంటి..? పెద్దల్ని వదిలిపెట్టి అన్ని పత్రాలూ ఉన్న సామాన్యులను పట్టుకోవడమేంటి..?’ అంటూ అధికారుల తీరుపై ఆగ్రహించింది ఏదో ప్రతిపక్ష నాయకుడు అనుకుంటే మీరు పొరపడినట్టే. మరెవరైవుంటారో తెలుసుకోవాలంటున్నారా..!
ఆయన ఇంకెవరో కాదు.. రాష్ట్ర శాసనసభాపతి
తన సొంత అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఉపాధి హామీ పనులపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొంత అవసరాలకు నాటుబండ్లపై ఇసుక తీసుకువెళ్తున్న వారిని, అన్ని ఆధారాలతో ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుక తీసుకువెళ్తున్న వారిని అధికారులు అడ్డుకుని, హంగామా సృష్టిస్తున్నారని కొంతమంది ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో అగ్రహోదాగ్రులు అయ్యారు.
అధికారులు అతీతులా..?
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ అధికారులు ఏమైనా అతీతులా అని ప్రశ్నించారు. ఎడ్లబండ్లపై ఇసుక తీసుకెళ్లే వారిపైనా అధికారులు కేసులు పెట్టడమేంటని ఆగ్రహించారు. ప్రభుత్వ పనుల నిమిత్తం గ్రామ సచివాలయం, ఇతర రెవెన్యూ అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాలు చూపించినా వదిలిపెట్టడం లేదని, కొందరు అధికారులు వారి శాఖలకు అతీతుల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. పెద్దల్ని వదిలిపెట్టి అన్ని పత్రాలూ ఉన్న సామాన్యులను పట్టుకోవడమేంటని ప్రశ్నించారు. ఇకపై జరిగే సమీక్షలకు సెబ్ (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో), మైనింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, జిల్లా ఇసుక అధికారి, అందరినీ పిలవాలని, వాళ్లంతా వస్తే తలుపులు వేయాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. స్పీకర్‌గా ఉన్న తాను అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, అయినా పరిస్థితులు అలా మారుతున్నాయని పేర్కొన్నారు. దాంతో సమావేశంలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.
అదే తరుణంలో, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇసుక కోసం సామాన్యులు ఎంత ఆరాటం, పోరాటం చేయాల్సి వస్తోందో తమ్మినేని ఆగ్రహం వాస్తవ పరిస్థితికి దర్పం పడుతోందని సమావేశంలో ఉన్నకొందరు గుసగుసలాడారు.