గతంలో చిన్న చిన్న సినిమాలు చేసినా .. టీవీలో కొన్ని షోలలో మెరిసినా, ‘బిగ్ బాస్’ షో ద్వారా లభించే గుర్తింపు వేరుగా ఉంటుంది. దాదాపు 100 రోజుల పాటు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటారు గనుక, వాళ్లతో పోటీదారులు మరింతగా కనెక్ట్ అవుతారు. స్క్రిప్ట్ లో ఉన్నట్టుగా కెమెరా ముందు నాలుగు ముక్కలు చదివి వెళ్లడం వేరు .. కెమెరాల సాక్షిగా తమ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడం వేరు. అలా వాళ్ల ఉత్సాహాలు .. ఉద్వేగాలు నచ్చినవాళ్లు అభిమానులుగా మారిపోతుంటారు. ఓట్లు వేసి గెలిపించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు.
‘బిగ్ బాస్’ సీజన్ 3కి శ్రీముఖి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె అందం .. అల్లరితనం ఆ సీజన్ ను ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించడానికి కారణమైంది. నిమ్మపండు రంగులో యాపిల్ పండులా మెరిసిపోయే ఈ అమ్మాయి, ‘బిగ్ బాస్’ హౌస్ లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. గ్లామర్ ను ఆయధంగా చేసుకుని చివరివరకూ పోరాడినా, రన్నర్ గానే మిగిలింది. కానీ ఇప్పటికీ ఈ అమ్మాయిని ఆ క్రేజ్ వెంటాడుతూనే ఉంది .. ఆ క్రేజ్ ను వెంటబెట్టుకునే ఈ అమ్మాయి తిరుగుతుంటుంది.
ఇక ‘బిగ్ బాస్’ సీజన్ 4 విషయానికొస్తే .. అరియానా ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఎప్పుడు చూసినా యాక్టివ్ గా కనిపిస్తూ .. ఇతర పోటీదారులతో బలమైన వాదనలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. టాప్ 5లో నుంచి బయటికి వచ్చిన ఈ అమ్మాయి, బిగ్ బాస్ అందించిన క్రేజ్ నుంచి మాత్రం ఇంకా బయటికి రాలేదు. సోషల్ మీడియాలో తనదైన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. అంతేకాదు శ్రీముఖితో కలిసి గోవా బీచ్ లో హల్ చల్ చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి అడుగుపెడితే గోవా బీచ్ అందం మరింత పెరిగే ఉంటుంది. ఇక అరియానా కేకలతో అక్కడ సందడి కూడా ఒక రేంజ్ లో పెరిగే ఉంటుంది కదూ!











