ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతుంటంతో పార్టీలన్నీ దుబ్బాకపైనే దృష్టి పెట్టాయి. అన్ని పార్టీలు తమ విజయావకాశాలను మెరుగుపరుచుకునే పనిలో పడ్డాయి. టీఆర్ఎస్ మినహా బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు తమ నేతలను అక్కడే మొహరించాయి. దీంతో ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. గ్రామాల్లో మకాం వేసిన వివిధ పార్టీల నేతలు తమకే ఓటేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు .ఇక టీఆర్ఎస్ , బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు సవాళ్ళు విసురుకుంటున్నారు. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక వేడి రాష్ట్ర వ్యాప్తంగా రాజుకుంటోంది.
హీట్ పెంచిన బండి సంజయ్ ఎపిసోడ్..
దుబ్బాక ఎన్నికల హీట్ పెంచింది బండి సంజయ్ ఎపిసోడే. రఘునందన్ రావు బంధువులను పరామర్శించేందుకు వెళ్ళిన సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేడయంతో బీజేపీ ఒక్కసారిగా రగిలి పోయింది. తమ అధ్యక్షుడి అరెస్ట్‌ను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్‌ను గెలిపిస్తే ఇలాంటి దాడులే తప్ప అభివృద్ది ఉండదంటూ ఆరోపిస్తున్నారు. ఇక బీజేపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేతలంతా రంగంలోకి దిగారు. మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అక్కడే ఉండి ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా మండలానికో ఇన్ ఛార్జ్‌ను నియించింది బీజేపీ. దీంతో ఊరూరా బీజేపీ ప్రచారం ఊపందుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అగ్ర నేతలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేస్తుండటంతో దుబ్బాకలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది.
రంగంలోకి ముఖ్యనేతలు..
నేడు ఒకేసారి ముగ్గురు ముఖ్యనేతలు బీజేపీ తరఫున ప్రచారానికి దిగారు. కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి దుబ్బాకలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మూడు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించడంతో పాటు టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి .. బీజేపీపై చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న ఆర్థిక సాయంతో పాటు రాష్ట్ర పథకాల్లో కేంద్రం నిధుల లెక్కలు తేల్చనున్నారు. మరో వైపు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సైతం విస్తృతంగా రోడ్ షోలో పాల్గొంటున్నారు. ఆయన బీహార్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నా ప్రత్యేకంగా దుబ్బాకలో ప్రచారం కోసం వచ్చారు. ఈయన బీసీలను టార్గెట్‌గా చేసుకుని చేసే ప్రచారం చేయనున్నారు. మరోవైపు తెలంగాణలో ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ రోజే దుబ్బాక పర్యటన చేపట్టారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది బీజేపీ నేతలు ప్రచారం ఉధృతం చేస్తుండటంతో గెలుపు ఎవరిదనేది .. ప్రచారంలో చేస్తున్న ప్రకటనల ప్రభావం ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి.