దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ టాప్ లీడర్ల మధ్య దూరం పెంచిందంటున్నారు ఆ పార్టీ నేతలు. దుబ్బాకలో ఒంటి చేత్తో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి హరీష్ రావు విపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ తన స్టైల్‌లో దూసుకు పోతున్నారు. ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటూ , కండవాలు కప్పుకుంటూ వారిని నైతికంగా దెబ్బకొట్టే పనిలో ఉన్నారు. అంతే కాకుండా దుబ్బాకలో పోటీ చేస్తున్న ఇతర పార్టీల నేతల వాహనాలు, ఇళ్లపై పోలీసుల దాడులు కూడా హరీష్ ఆదేశాలతోనే జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. దీంతో విపక్ష పార్టీలు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నాయి. హరీష్ వ్యవహారంతోనే అనవసరంగా ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఒక్క సీటు కోసం పార్టీపై ఇంతగా నెగిటివ్ క్రియేట్ చేయించాలా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్ అసహనం
ముఖ్యంగా హరీష్ వ్యవహారంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. హరీష్ తీరుపై ఆయన గుర్రుగా ఉన్నారని, ఆయన పార్టీ పేరు, ప్రతిష్టను దిగజారుస్తున్నరంటూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఎన్నో ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి ఇంతగా పార్టీపై ఎప్పుడు వ్యతిరేకత రాలేదని, ప్రచారం కూడా జరగలేదని కేటీఆర్ అభిప్రాయ పడుతున్నారట. హరీషే ఇవన్ని చేయిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలగడం పార్టీకి నష్టం చేసే అంశమే అంటూ కేటీఆర్ సన్నిహితుల వద్ద చెపుతున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.
గెలుపు నల్లేరుపై నడకలా ఉండాలి
కేవలం ఒక్క సీటు , అది కూడా తమ సిట్టింగ్ స్థానంలో చనిపోయిన ప్రజా ప్రతినిధి భార్యకే టికెట్ ఇచ్చింది పార్టీ. ప్రజల్లో సానుభూతితో పాటు అధికారంలో ఉన్న పార్టీ కావడంతో గెలుపు నల్లేరుపై నడకలా ఉండాలని, కాని ప్రజల్లో ఇలా ఎందుకు వ్యతిరేకత వచ్చిందన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీనే పోలీసుల తనిఖీలను చేయిస్తోందని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమయితే పార్టీకి ఎదురు దెబ్బలు తప్పవన్న భావనలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే , ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు ఇచ్చిన టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేయాలనే భావనలో ఉండే హరీష్ రావు మాత్రం తన పని తాను చేసుకు పోతున్నారు. ఎవరు ఏమన్నా దుబ్బాక ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తూ ప్రచార కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. ఈ మధ్య జరిగిన పరిణామాలతో కేటీఆర్ కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దుబ్బాకలో ఉప ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో పోలీసు తనిఖీలతో బీజేపీ దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జోరుగా ప్రచారం సాగడంతో కేటీఆర్ కాస్త నొచ్చుకున్నట్టు చెబుతున్నారు. అయితే, ఈ ఉప ఎన్నికల్లో దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఓడి పోతే మాత్రం కల్వకుంట్ల కుటుంబంలో మరో చిచ్చు ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.