వరద సాయంలో తమ పని తాము చేసుకోనివ్వకుండా టీఆర్‌ఎస్ నేతలు అడ్డుపడుతున్నారంటూ అధికారులు వాపోతున్నారు. తమకు నచ్చిన వారికే సాయం చేసేలా ఒత్తిడి తెస్తున్నారని అధికారులు సన్నిహితులతో చెబుతున్నారు. ఇప్పటికే వరద సాయం కోసం గ్రేటర్ అధికారులపై ప్రజలు ఒత్తిడి తెస్తున్నారు. తమ ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయినా తమకు సాయం చేయడం లేదంటూ బాధితులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఏకంగా జీహెచ్ఎంసీ కార్యాలయాల వద్దకు వచ్చి బాధితులు ఆందోళన చేపడుతున్నారు. దీంతో అధికారులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి.
వారు చెప్పిందే వేదం..
వరద సాయంలో టీఆర్ఎస్ నేతలు, మంత్రి ప్రమేయంపై ఓ అధికారి ఎమ్మెల్యే రాజాసింగ్‌తో ప్రస్తావించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. తమ పనిని తాము చేసుకోకుండా అడ్డుపడుతున్నట్టు ఫోన్ రికార్డ్స్‌లో బయట పడింది. నగదు సాయం ఎంతమందికి చేసింది చెప్పమని అడిగితే తన ఆవేదన వెళ్ళగక్కారు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ వినయ్ కపూర్. తాను ఎమ్మెల్యేను పిలుద్దామని చెప్పినప్పుడు ఆ రికార్డ్‌ను టీఆర్ఎస్ నేతలు మంత్రి తలసానికి వినిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల ఆగడాలపై సీఎస్ దృష్టికి సైతం తీసుకెళ్ళామని తెలిపారు వివేక్. దీంతో సీఎస్ సైతం ఎవరు ఎక్కడ డబ్బులు ఇవ్వడం ఆపితే అక్కడే ఆపేయమని చెప్పారని ఎమ్మెల్యేతో ఆ అధికారి చెప్పారు. మంత్రి తలసాని సైతం ఈ విషయంలో ఎక్కువగా చేస్తున్నారని, ఆయన రాష్ట్రానికి మంత్రా లేక గోషామహల్‌కా అని ఎమ్మెల్యే వద్ద వాపోయాడు అధికారి. స్థానిక టీఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు తన ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి తలసాని ఇంత చేస్తున్నా మీరెందుకు ఊరుకుంటున్నారని అధికారి ఎమ్మెల్యేను అడిగారంటేనే ఎంతగా ఆయన విసిగిపోయారో అర్థమవుతుంది. ఈ ఆడియో టేప్ ఇప్పుడు సంచలనమయ్యింది
అధికారిని బదిలీ చేసిన ప్రభుత్వం..
ఆడియో టేపులు బయట పడటంతో టీఆర్ఎస్ నేతలు తన పరపతికి పని చెప్పారు.మరుసటి రోజే ఆయనను అక్కడ నుండి ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రభుత్వం తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ సాయం ప్రజలకు అందజేయడం అధికారుల పనని, దానిని టీఆర్ఎస్ కార్యక్రమంలా ఆ పార్టీ కలరింగ్ ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పని ఒత్తిడిని చెప్పుకున్న అధికారిని ఇలా బదిలీతో వేధిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. వరద సాయంలో ప్రభుత్వ వైఫల్యం బయట పడుతుందనే అధికారులను వేధిస్తున్నారని, ఇది మంచి సంప్రదాయం కాదంటున్నారు విపక్ష పార్టీల నేతలు. ఇప్పటికైనా నిజమైన వరద బాధితులకు పూర్తి సాయం అందజేయాలని.. సాయం ఎంతమందికి చేశారన్న పూర్తి వివరాలు అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.